పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలి
విశాఖపట్నం, సూర్య : విశాఖపట్నం జిల్లాలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో కౌంటింగ్ ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉదయం 7 గంటలకే అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లను తెరిచి, ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ హాళ్లలో ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలని, అనధికార వ్యక్తులను అనుమతించకూడదని సూచించారు. ఎవరైనా గొడవలు, అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తే తొలుత సముదాయించి నచ్చజెప్పాలని, అప్పటికీ వినకపోతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
థర్డ్ ర్యాండమైజేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, ప్రతి టేబుల్‌కు ఇన్‌చార్జిని నియమించాలన్నారు. ఆర్వోలు కౌంటింగ్ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, వ్యాలిడ్, ఇన్వాలిడ్ ఓట్ల విషయంలో అభ్యర్థులు, ఏజెంట్లకు స్పష్టత ఇవ్వాలని సూచించారు. ప్రాథమిక లెక్కింపు పూర్తయిన వెంటనే వివరణాత్మక లెక్కింపు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అభ్యర్థి వారీగా లెక్కింపు పూర్తయిన వెంటనే సంబంధిత అధికారి సంతకంతో ఫలితాలను వెల్లడించాలని, రీ-కౌంటింగ్‌కు దారితీసే పరిస్థితులు తలెత్తకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. ఫలితాల సమాచారాన్ని మీడియాకు ఎప్పటికప్పుడు అందించాలని, పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి సమస్యాత్మక పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అధికారులు, సిబ్బంది బృంద స్ఫూర్తితో పనిచేసి ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. టెలికాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఆర్డీవోలు దిలీప్ చక్రవర్తి, సంగీత్ మాధుర్, ఆయా మండలాల రిటర్నింగ్ అధికారులు, లైన్ ఇన్‌చార్జి అధికారులు పాల్గొన్నారు.