మంత్రి స్థాయికి ఇది తగదు -40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు, పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మేకపాటి విక్రమ్ రెడ్డిని అనంతసాగరంలోని పోలింగ్ కేంద్రం వద్ద అవమానపరిచేలా వ్యవహరించడంలో పోలీసులు ఓవరాక్షన్ చేయడం సరికాదని, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనలతోనే ఇలా పోలీసు అధికారులు వ్యవహరించారనే విషయం స్పష్టమవుతుందని ఆత్మకూరు మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థిని అల్లారెడ్డి ఇందుమతి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె ఆత్మకూరులో మాట్లాడుతూ గురువారం నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు కొన్ని కేంద్రాల్లో స్థానిక టీడీపీ నాయకుల అరాచకాలను ఎండగట్టేందుకు వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ మేకపాటి విక్రమ్ రెడ్డి పర్యటించారన్నారు. అయితే ఎన్నికల నిబంధనల మేరకే ఆయన పోలింగ్ కేంద్రాల వెలుపల గేట్ల వద్దే నిలుచొని ఉన్నారని అదే సమయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గేటుకు మరోవైపుకు నిల్చొని ఉన్నారన్నారు.
ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు రాజకీయ నాయకులైన, మంత్రులైనా నిబంధనలు పాటించాల్సిందేనని, అయితే ఆత్మకూరు సీఐ గంగాధర్ మంత్రి గేటు వద్ద నిలబడి ఉన్నా పట్టించుకోకుండా, కేవలం మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రేడ్డిని మాత్రమే అక్కడి నుంచి పంపించేందుకు నానా యాగి చేశారని ఆమె దుయ్యబట్టారు. ఎన్నికల నిబంధనలు అందరికి వర్తిస్తాయనే విషయం సీఐ గంగాధర్ కు తెలియదా అని ఆమె ప్రశ్నించారు. దీనికితోడు 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకొనే మంత్రి ఆనం తన స్థాయిని దిగజార్చుకొని వ్యవహరిస్తూ మేకపాటి విక్రం రెడ్డి పైకి దూసుకొనిపోవడం ఎంత వరకు న్యాయమని ఆమె అన్నారు. ఇదే క్రమంలో మర్రిపాడు మండలంలోని తిక్కవరం పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతున్న సమాచారం తెలుసుకొని మేకపాటి విక్రమ్రేడ్డి అక్కడికి వెళ్తుండగా సీఐ గంగాధర్ ఆయన వెంట పడి పోలీసు జీపును అడ్డుగా పెట్టి సుమారు 40 నిమిషాలసేపు ఆయనను రోడ్డుపై నిలిపివేయడం ఆటవిక చర్యగా ఆమె అభివర్ణించారు. మంత్రి ముందస్తు సూచనలతోనే పోలీసులు సహకరిస్తూ పలు పోలింగ్ కేంద్రాల్లో పచ్చచొక్కాల నాయకులను తలపించేలా వ్యవహరించారని ఆమె అన్నారు. ఉన్నత స్థాయి అధికారులు ఈ పోలింగ్ ప్రక్రియను పరిశీలించి తగు అధికారులపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వెంట పార్టీ మున్సిపల్ విభాగ రాష్ట్ర కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి ఉన్నారు.