వినాయక స్వామి కుంభాభిషేకం లో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి
పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కల్లుపల్లి పంచాయతీ పరిధిలోని మిట్టూరు గ్రామంలో కొలువుదీరిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన మహా కుంభాభిషేక మహోత్సవం సోమవారం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకకు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మహోత్సవంలో భాగంగా ఆలయంలో శాస్త్రోక్తంగా కలశారాధన, నిత్య హోమం, ప్రాణప్రతిష్ఠ హోమం, కలశోద్ధాసన తదితర వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రాణప్రతిష్ఠ, మహా కుంభాభిషేక సంప్రోక్షణ, మహా మంగళహారతి కార్యక్రమాలు అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ అత్యంత వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా మహా కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు.
అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డిని ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, సోమశేఖర్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, రామ్మోహన్, సతీష్, భరత్, సురేష్, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి రిపోర్టర్