గ్రౌండ్ లెవెలింగ్ పనులు దాదాపు పూర్తి.. పలుమార్లు వాటరింగ్ చేయాలని కలెక్టర్ ఆదేశం
సిద్దిపేట, ; ప్రతినిధి : ఈ నెల 19న సిద్దిపేట జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్న భారీ బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలను ముందస్తు ప్రణాళికతో సిద్ధం చేయాలని సూచించారు.సోమవారం జిల్లా కేంద్రంలోని నాగదేవత గుడి ముందు భాగంలో, నందాల వెంకట లక్ష్మి గార్డెన్ వెనుకవైపు బైపాస్, చిన్నగుండవెల్లి రోడ్డుకు ఆనుకొని సుమారు 16 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ ప్రాంగణాన్ని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సభా ప్రాంగణంలో ట్రాక్టర్లు, డోజర్ల సహాయంతో చేపట్టిన నేల చదును పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. గ్రౌండ్ మొత్తం పలుమార్లు వాటరింగ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సభ నిర్వహణకు అనువుగా ప్రాంగణాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని సూచించారు.
బారికేడింగ్, వేదిక నిర్మాణ పనులు వేగవంతం చేయాలి..
సభా ప్రాంగణం చుట్టూ భారీ బారికేడింగ్ ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రౌండ్‌లో వాటరింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే వేదిక నిర్మాణ పనులు ప్రారంభించాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. పనులన్నీ నిర్ణీత గడువులో పూర్తి చేసేలా శాఖల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు.
పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు…
సభకు భారీ సంఖ్యలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు. సభా ప్రాంగణం చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాలను ట్రాక్టర్లు, డోజర్లతో చదును చేసి వాహనాలు సులభంగా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.సభ విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు బాధ్యతతో పనిచేయాలని, పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ సూచించారు.ఈ పరిశీలనలో తహసీల్దార్ హరి కిరణ్, ఆర్ అండ్ బీ, మున్సిపల్ శాఖల అధికారులు, ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.