విజయవంతంగా ముగిసిన పెన్షనర్ల 24 గంటల ధర్నా
పార్వతీపురం, సెప్టెంబర్ 30 :మేజర్ న్యూస్ :
ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపు, రాష్ట్ర పింఛనుదారుల కార్యవర్గం ఆంధ్రప్రదేశ్ సూచనల మేరకు పార్వతీపురం మన్యం జిల్లా పింఛనుదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 24 గంటల ధర్నా బుధవారం విజయవంతంగా ముగిసింది. ఈ నెల 29న ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ధర్నా 30వ తేదీ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పింఛనుదారులు 8వ కేంద్ర వేతన సంఘం ప్రయోజనాలను పింఛనుదారులకు వర్తింపజేయాలని, పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (డిఎ) బకాయిలను వెంటనే చెల్లించాలని, పింఛనుదారుల ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం పింఛనుదారుల ప్రతినిధులు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. తమ డిమాండ్లను పరిష్కరించేలా చర్యలు తీసుకోవడంతో పాటు, వినతిపత్రాన్ని కలెక్టర్ ద్వారా భారత ప్రధానమంత్రికి పంపించాలని కోరారు. కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు ఆబోతుల త్రినాధం, దొడ్లంకి గణపతిరావు, కోశాధికారి ఆర్. తవిటి నాయుడు, ఉపాధ్యక్షురాలు మనోహర భాయ్, సభ్యులు గొర్లి అప్పలరాజు, వెలగల సన్యాసినాయుడు, పిల్లా లక్ష్మునాయుడు, గుంట్రెడ్డి తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు.