విద్యుత్ సర్వీసులను వినియోగానికి అనుగుణమైన సరైన కేటగిరీలోనే వినియోగించుకోవాలి
నెల్లూరు, మేజర్ న్యూస్ : తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయానికి చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (అసెస్‌మెంట్) శ్రీ పి. శంకరయ్య గారు ఈరోజు నెల్లూరు టౌన్ పరిధిలో డీపీఈ విభాగం నమోదు చేసిన మాల్ ప్రాక్టీస్ (ఎంపీ) కేసులను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత విద్యుత్ సర్వీసులను తనిఖీ చేసి, వినియోగదారులతో మాట్లాడి, కేసుల నమోదు వివరాలు మరియు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు టౌన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ ఎం. శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పి. శంకరయ్య మాట్లాడుతూ, డీపీఈ విభాగం మరియు ఆపరేషన్ విభాగం అధికారులు నమోదు చేసిన కేసులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాస్తవ పరిస్థితులను నిర్ధారించేందుకు తిరుపతి కార్పొరేట్ కార్యాలయం నుంచి అధికారులు వచ్చి తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. సంబంధిత సర్వీసులను పరిశీలించడంతో పాటు వినియోగదారులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకోవడం ద్వారా తనిఖీల్లో పారదర్శకత పాటిస్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా సరైన కేటగిరీలో విద్యుత్ సర్వీసును పొందాలని ఆయన సూచించారు. మొదట గృహ అవసరాల కోసం డొమెస్టిక్ సర్వీసు కనెక్షన్ తీసుకున్నప్పటికీ, తదనంతరం వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే, తప్పనిసరిగా సంబంధిత సర్వీసు కేటగిరీని కమర్షియల్ కేటగిరీకి మార్చుకోవాలని స్పష్టం చేశారు. సర్వీసు కేటగిరీ మార్పు ప్రక్రియ సులభతరంగా ఉందని, వినియోగదారులు తమ సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయంలో నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు అందిన తర్వాత సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనల ప్రకారం సర్వీసు కేటగిరీ మార్పు చేపడతారని వివరించారు. గృహ విద్యుత్ సర్వీసులను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తూ, కేటగిరీని మార్చుకోని పక్షంలో తనిఖీల సమయంలో నిబంధనల ప్రకారం మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. కాబట్టి విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, తమ సర్వీసులను సరైన కేటగిరీలోకి మార్చుకొని విద్యుత్ శాఖకు సహకరించాలని శ్రీ పి. శంకరయ్య విజ్ఞప్తి చేశారు.