విద్యార్థులకు పూర్వ విద్యార్థి చేయూత..
విద్యార్థులకు పూర్వ విద్యార్థి చేయూత..
▪️రూ.6 వేల విలువైన 12 జతల క్రీడా దుస్తుల పంపిణీ..
పొదలకూరు, సెప్టెంబర్ 25: విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు, పాఠశాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తూ మరుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి ఏ. అనుదీప్ ఆదర్శంగా నిలుస్తున్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సుమారు రూ.6 వేల విలువైన 12 జతల క్రీడా దుస్తులను ఆయన స్వయంగా సమకూర్చి అందించారు. పొదలకూరు మండలం మరుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ. వెంకటేశ్వర శర్మ, వ్యాయామ ఉపాధ్యాయులు పముజుల శ్రీనివాసులు మాట్లాడుతూ పూర్వ విద్యార్థి ఏ. అనుదీప్ అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేందుకు ఇలాంటి ప్రోత్సాహం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
నాలుగేళ్లుగా విద్యార్థులకు ప్రోత్సాహం
ఏ. అనుదీప్ గత నాలుగు సంవత్సరాలుగా పాఠశాల విద్యార్థులను విద్యాపరంగా ప్రోత్సహిస్తున్నారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో పాఠశాల స్థాయిలో 500 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు తెలిపారు.
విద్యార్థులు మంచి మార్కులు సాధించడంతో పాటు క్రీడలు, ఇతర రంగాల్లోనూ ప్రతిభను కనబరచాలని, పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ విద్యాసంస్థకు అండగా నిలవడం స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. పాఠశాలలో చదివి ఉన్నత స్థాయికి చేరుకున్న పూర్వ విద్యార్థులు తమకు చేతనైన విధంగా ప్రస్తుత విద్యార్థులను ప్రోత్సహిస్తే విద్యార్థుల్లో మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులకు క్రీడా దుస్తులు అందించిన ఏ. అనుదీప్‌కు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు