విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా ‘అమిలినేని విద్యాచక్రం’ నియోజకవర్గంలో 7,300 మంది విద్యార్థులకు రూ.5 కోట్లతో సైకిళ్ల పంపిణీ 2028 మార్చి నాటికి బీటీపీ ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు అందిస్తాం: ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు
అనంతపురం బ్యూరో : రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, దేశం గర్వించదగిన నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు.
కుందుర్పి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ‘అమిలినేని విద్యాచక్రం’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. తొమ్మిది, పది తరగతులతో పాటు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్న ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు.
నియోజకవర్గవ్యాప్తంగా మొత్తం 7,300 మంది విద్యార్థులకు సుమారు రూ.5 కోట్ల వ్యయంతో సైకిళ్లు అందించనున్నట్లు వెల్లడించారు. నారా లోకేష్ స్ఫూర్తితో విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి, వారి ప్రయాణ సౌకర్యం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
### విద్యావ్యవస్థను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పాఠశాలల కనీస అవసరాలు, విద్యార్థులకు అవసరమైన వసతులపై తగిన శ్రద్ధ చూపలేదని ఎమ్మెల్యే విమర్శించారు. విద్యావ్యవస్థ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వకుండా గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు.
తమ కుటుంబం ఇప్పటికీ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తోందని, ప్రజలకు చేతనైనంత సాయం చేయాలనే ఉద్దేశంతోనే తాను సేవా కార్యక్రమాలు చేపడుతున్నానని అమిలినేని తెలిపారు. దోచుకోవడానికి, దాచుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఎస్సార్సీ సంస్థ సహకారం ఎంతో ఉందని పేర్కొన్నారు. సంస్థలో పనిచేస్తున్న సుమారు 7,000 మంది ఉద్యోగుల కృషి, సహకారంతో విద్యార్థులకు పెద్ద ఎత్తున సైకిళ్లు అందించగలుగుతున్నామని తెలిపారు. సంస్థ ప్రతినిధులు రాజగోపాల్, వెంకటేష్, మహీధర్‌రెడ్డితో పాటు యశ్వంత్, నవీన్, ధర్మతేజ, అవినాష్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
### 2028 మార్చి నాటికి బీటీపీ పూర్తి
బీటీపీ ప్రాజెక్టు గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆలస్యమైందని అమిలినేని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాబ్ క్యాలెండర్‌తో పాటు సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సంబంధించి ఇరిగేషన్ క్యాలెండర్‌ను ప్రకటించారని తెలిపారు. అందులో భాగంగా బీటీపీ ప్రాజెక్టును 2028 మార్చి నాటికి పూర్తి చేసి రైతులకు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
అలాగే కుందుర్పమ్మ గిరిప్రదక్షిణను అందరి సహకారంతో అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంతో పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గం కూడా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీడీపీ నాయకులు, ఎస్సార్సీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.