విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం.. ఉన్నత శిఖరాలకు బాటలు!
జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా 30 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు..
నగదు బహుమతుల అందజేత!
ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:
జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ప్రొద్దుటూరు అంజుమన్ ఏ ఆహాలే ఇస్లాం ఆధ్వర్యంలో స్థానిక ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్‌లో ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో విద్య పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు, ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 2025-26 విద్యా సంవత్సరంలో ప్రొద్దుటూరు పట్టణ పరిధిలో పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 30 మంది ముస్లిం విద్యార్థినీ, విద్యార్థులను ఎంపిక చేసి ప్రతిభా పురస్కారాలతో పాటు నగదు బహుమతులు అందజేశారు. అంజుమన్ ఏ ఆహాలే ఇస్లాం అధ్యక్షులు, రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి.ఎస్. ముక్తియార్, ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ నంద్యాల రాఘవరెడ్డి చేతుల మీదుగా ఈ బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం తొమ్మిది, పదవ తరగతులు చదువుతున్న ముస్లిం విద్యార్థిని, విద్యార్థులకు ఉన్నత విద్యపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. పదవ తరగతి అనంతరం ఎంచుకోవాల్సిన విద్యా కోర్సులు, భవిష్యత్తులో అందుబాటులో ఉండే అవకాశాలు, లక్ష్య సాధనకు అవసరమైన కృషి, పట్టుదల వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు చదువులో రాణించడంతో పాటు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని సమాజంలో మంచి స్థాయికి ఎదగాలని వక్తలు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ నంద్యాల రాఘవరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారికి తగిన ప్రోత్సాహం అందించడం ద్వారా మరింత ఉన్నత స్థాయికి చేరుకునే స్ఫూర్తి కలుగుతుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రతిభా పురస్కారాలు అందించడం, ఉన్నత విద్యపై అవగాహన కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యారంగంలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చిన అంజుమన్ ఏ ఆహాలే ఇస్లాం సంస్థ అధ్యక్షులు, కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి సత్కరించడం, ఉన్నత విద్యకు సంబంధించి సరైన మార్గనిర్దేశం చేయడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చని ఈ కార్యక్రమం చాటిచెప్పింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా మున్సిపల్ చైర్మన్ నంద్యాల రాఘవరెడ్డి, వార్డు కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అంజుమన్ కమిటీ సభ్యులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఎ ప్రతాప్ ప్రొద్దుటూరు అర్బన్ వైఎస్సార్ కడప జిల్లా