చిన్నారుల సమగ్ర అభివృద్ధిపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ
వత్సవాయి: మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం అంగన్వాడీ కార్యకర్తలకు ‘పోషణ్ భీ, పఢాయీ భీ’ రెండవ విడత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణ తరగతులు రెండు రోజుల పాటు, బుధ, గురువారాల్లో నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా ఏసీడీపీఓ సరళ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారి శారీరక, మానసిక ఎదుగుదలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పిల్లల వయస్సుకు అనుగుణంగా వారి ఎదుగుదల ఎలా ఉండాలి, ఏ నెలలో ఎలాంటి అభివృద్ధి మైలురాళ్లను చేరుకోవాలి అనే అంశాలను వివరించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రధానంగా మూడు కీలక అంశాలపై అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పిస్తున్నారు. మొదటిగా పుట్టినప్పటి నుంచి మూడు సంవత్సరాల వయస్సు వరకు ఉన్న చిన్నారులకు ప్రారంభ బాల్య ఉద్దీపన (ఎర్లీ చైల్డ్‌హుడ్ స్టిమ్యులేషన్) అందించే విధానం, రెండవది మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు ప్రాథమిక అభ్యాసం (ఫౌండేషనల్ లెర్నింగ్) ద్వారా విద్యా నైపుణ్యాలను పెంపొందించే పద్ధతులు, మూడవది అంగన్వాడీ కేంద్రాల్లో దివ్యాంగ పిల్లల చేరికను పెంచడం, వారి ఎదుగుదలను ప్రత్యేకంగా పర్యవేక్షించడం, ఇందుకు అవసరమైన పర్యవేక్షణ పరికరాల వినియోగం, గృహ సందర్శనల ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.అలాగే చిన్నారుల్లో పోషకాహార లోపాలను గుర్తించడం, వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడం, ఆకలి పరీక్షలు నిర్వహించే విధానం, వయస్సుకు తగిన ఆహారపు అలవాట్లు, బాలల ఆరోగ్య సంరక్షణ వంటి పలు కీలక అంశాలను వివరించారు. అంగన్వాడీ కేంద్రాలు కేవలం పౌష్టికాహారం అందించే కేంద్రాలుగానే కాకుండా చిన్నారుల భవిష్యత్తుకు పునాది వేసే కేంద్రాలుగా పనిచేయాలని సూచించారు.చిన్నారులకు పోషణతో పాటు ప్రాథమిక విద్య, ఆటపాటల ద్వారా నేర్చుకునే అవకాశాలు కల్పిస్తూ ప్రతి బిడ్డ సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీ కార్యకర్తలు కృషి చేయాలని ఏసీడీపీఓ సరళ సూచించారు.ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ బీ.బీ. జాన్‌తో పాటు మండలంలోని పలువురు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.