విద్యార్థుల లక్ష్యాలకు క్రమశిక్షణే పునాది : డీఈఓ
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : విద్యార్థి దశలో ఏర్పరచుకునే లక్ష్యాలు, అలవర్చుకునే క్రమశిక్షణే భవిష్యత్తు జీవితానికి పునాది అవుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.ఎన్.కుమార్ అన్నారు. మొబైల్ ఫోన్లు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. మహతి ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన బాబా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ 33వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఆశయాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే ఉన్నత ఆశయాలను నిర్దేశించుకుని పట్టుదలతో ముందుకు సాగాలని, కలలు కనడంతో పాటు వాటిని నిజం చేసుకునేందుకు నిరంతర శ్రమ, సమయపాలన, ఆత్మవిశ్వాసం అవసరమని పేర్కొన్నారు. చదువుకునే వయసులో మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారడం భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతిభతో పాటు కష్టపడే తత్వం ఉన్నవారికే మెరుగైన అవకాశాలు లభిస్తాయన్నారు. విద్యార్థుల విజయాల్లో తల్లిదండ్రుల పాత్ర కీలకమని, పిల్లలపై ఒత్తిడి పెంచకుండా వారి ఆసక్తులను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు.
కరస్పాండెంట్ రమేష్ బాబు మాట్లాడుతూ పాఠ్యాంశాల బోధనతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను అలవర్చడమే తమ లక్ష్యమని, ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికితీసేందుకు విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గత ఏడాది పదో తరగతి ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆప్సా రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, కరస్పాండెంట్ ఆర్.భువనేశ్వరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్