వెలుగుల దానం.. ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపిన నేత్రదానం
శ్రీకాకుళం, నవంబర్ 13 మేజర్ న్యూస్ :
"మనిషి మరణించిన తర్వాత కూడా ఆమె కళ్ల ద్వారా ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. అదే నేత్రదానం గొప్పతనం." ఈ సందేశాన్ని మరోసారి సార్థకం చేస్తూ శ్రీకాకుళం పట్టణానికి చెందిన కర్రి. దేవకి (74y)నేత్రాలను దానం చేయాలనే నిర్ణయాన్ని కుటంబ సభ్యులు( భర్త - కర్రి. చంగలరావు, కొడుకులు -కర్రి. ముత్యాలరావు, కర్రి. వేణు గోపాలరావు )తీసుకోవడం నిజమైన మానవత్వానికి ప్రతీకగా నిలిచింది.తాను చనిపోతూ మరో ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగు నింపే ఈ మహోన్నత సేవకు తన కుటుంబ సభ్యులు ముందుకు రావడం అభినందనీయమని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ పి. జగన్మోహనరావు కొనియాడారు.
జిల్లా రెడ్‌క్రాస్ సమన్వయంతో, మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్లు పూతి.సుజాత మరియుపి. చిన్ని కృష్ణ ల ద్వారా మృతదేహం నుంచి కార్నియాలను విజయవంతంగా సేకరించి, వాటిని ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నేత్ర సేకరణ కేంద్రానికి తరలించారు.
ఈ సందర్భంగా నేత్రదానానికి సహకరించిన కుటుంబ సభ్యులకు జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ పి. జగన్మోహనరావు, కార్యదర్శి బి. మల్లేశ్వరరావు, కోశాధికారి కె. దుర్గా శ్రీనివాస్‌తో పాటు ఇతర సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా జగన్మోహనరావు మాట్లాడుతూ, నేత్రదానంపై ప్రజల్లో రోజురోజుకీ అవగాహన పెరగడం సంతోషకరమైన పరిణామమన్నారు. మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా అంధులకు ఈ అందమైన ప్రపంచాన్ని చూసే అమూల్యమైన అవకాశం కల్పించవచ్చని తెలిపారు. అంధత్వ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి కుటుంబం, ప్రతి యువకుడు ముందుకు వచ్చి నేత్రదాన ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
నేత్రదానం అనేది కేవలం అవయవ దానం కాదు... అది ఆశను, ఆనందాన్ని, జీవితాన్ని పంచే మహాదానం. ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపగలిగే గొప్ప అవకాశం నేత్రదానం మాత్రమే. మనం ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టినా, మన కళ్ల ద్వారా మరొకరు ఈ అందమైన ప్రపంచాన్ని చూసే అవకాశం కల్పించడం కంటే గొప్ప మానవతా సేవ మరొకటి లేదు. ప్రతి కుటుంబం నేత్రదానంపై అవగాహన పెంపొందించుకొని ఈ మహోద్యమంలో భాగస్వాములు కావాలి.
నేత్రదానం చేయాలనుకునే వారు సంప్రదించవచ్చు:
పి. సుజాత: 78426 99321,
"మరణం జీవితానికి ముగింపు కావచ్చు... కానీ నేత్రదానం ద్వారా మరో ఇద్దరి జీవితాల్లో కొత్త ఉదయానికి నాంది పలకవచ్చు."