వైసీపీ వి చీప్ పాలిటిక్స్-మంత్రి నారాయణ.
వైసీపీ వి చీప్ పాలిటిక్స్-మంత్రి నారాయణ.
నెల్లూరు నగరాభివృద్ధికి పెద్దపీట
రూ.60 కోట్లతో ఆధునిక మార్కెట్
రూ.46 లక్షలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన
నెల్లూరు,కార్పొరేషన్, మేజర్ న్యూస్
విమర్శకులు నోళ్లు మూసేలా నెల్లూరు నగరాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. 4వ డివిజన్ కృష్ణవేణి స్కూల్ వీధిలో రూ.16 లక్షలతో, 7వ డివిజన్ వైవీఎం ఎలిమెంటరీ స్కూల్ సమీపంలో రూ.30 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. 9వ డివిజన్ నవాపేటలో రూ.60 కోట్లతో చేపట్టనున్న ఆధునిక మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో రూ.3,500 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. 2028 జూన్ 12 నాటికి నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది జూన్ 12లోపు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పథకాలను పూర్తి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పనులు పూర్తికాక నిధులు వెనక్కి వెళ్లాయని, ప్రస్తుతం మళ్లీ నిధులు తీసుకొచ్చి పనులను పూర్తి చేస్తున్నామని వివరించారు.
నగరాన్ని దోమలులేని నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలకు సీఎం రూ.50 వేల కోట్ల నిధులు కేటాయించారని చెప్పారు.
వ్యాపారులకు అనుకూలంగా మోడ్రన్ మార్కెట్
నవాపేట మార్కెట్ యార్డులో రూ.60 కోట్లతో ఆధునిక మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. తొలిదశలో రూ.13 కోట్లతో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. మార్కెట్ నిర్మాణంపై వ్యాపారులతో చర్చించి, వారి అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపడతామని వెల్లడించారు.నగరంలోని ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని, స్విమ్మింగ్ పూల్స్ వంటి సదుపాయాలను కూడా కల్పిస్తామని మంత్రి తెలిపారు.
తనపై వస్తున్న ఆరోపణలపై,
విమర్శలపై మంత్రి స్పందించారు .ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. పేదల అభ్యున్నతికి సొంత నిధులు కూడా ఖర్చు చేస్తున్నానని చెప్పారు. అసత్య ఆరోపణలను ప్రజలు విశ్వసించరని, తాను వాటిని పట్టించుకోనని అన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత, అసిస్టెంట్ కమిషనర్ రేష్మా, కార్పొరేషన్ ఈఈ అనీల్‌కుమార్, డీఈ శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ తాళ్లపాక అనూరాధ, డివిజన్ టీడీపీ నేతలు బాలాజీ, రాజశేఖర్, వ్యాపార సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు