ఏఐతో పర్యాటక రంగానికి మరింత ఊతం*
*ఏఐతో పర్యాటక రంగానికి మరింత ఊతం*
*పర్యాటక ప్రాంతాల పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం కీలకం*
*యువత సమయాన్ని సద్వినియోగం చేసుకుని లక్ష్యసాధనకు కృషి చేయాలి*
*జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*
కర్నూలు, సెప్టెంబర్ 27:- పర్యాటక రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం మరింత పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు...
ఆదివారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవము - 2026 కార్యక్రమమును ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా డిజిటల్ ఎజెండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పర్యాటక రంగాన్ని పునఃరూపకల్పన చేసే థీమ్ తో చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.. కర్నూలు జిల్లాలో చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. కొండారెడ్డి బురుజు వంటి చారిత్రక ప్రదేశాలతో పాటు మంత్రాలయం, పెద్దతుంబళంలోని జైన దేవాలయం, రామాలయం, ఉరుకుంద తదితర ప్రాంతాలను అనుసంధానించి టెంపుల్ సర్క్యూట్ గా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రాలయానికి బెంగళూరు, బళ్లారి తదితర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇతర పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించేలా ప్యాకేజీలను రూపొందించి ఆన్‌లైన్‌లో ప్రచారం చేస్తే పర్యాటకుల బస సమయం పెరిగి, స్థానికంగా హోటళ్లు, ఆహారం, రవాణా, ఇతర వ్యాపారాలకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని కలెక్టర్ వివరించారు. గాజులదిన్నె ప్రాజెక్టు వద్ద రిసార్ట్, బోటింగ్ తదితర సౌకర్యాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రాంజల చెరువు, సుంకేశుల బ్యారేజీ ప్రాంతాల్లోనూ పర్యాటక అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. వర్షపాతం తక్కువగా ఉండటంతో కొన్ని ప్రాజెక్టుల పనులు మందగించినప్పటికీ, భవిష్యత్తులో పర్యాటకుల రాక పెంచేందుకు వీటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని కేసీ కెనాల్‌ను శుభ్రం చేసిన అనంతరం ప్రజలు వాకింగ్, విశ్రాంతి కోసం ఆ ప్రాంతాన్ని వినియోగించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు. పర్యాటక ప్రాంతాలు, కాలువలు, నదులు, రహదారులు తదితర ప్రాంతాల్లో చెత్త వేయకుండా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
ప్రస్తుతం పోలీస్ శాఖతో పాటు వివిధ రంగాల్లో ఏఐ, కంప్యూటర్ టెక్నాలజీపై శిక్షణ ఇస్తున్నారని, సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాలు, ఫోరెన్సిక్ దర్యాప్తు, ఫింగర్‌ప్రింట్ వంటి సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా నేరాలను త్వరితగతిన ఛేదించేందుకు అవకాశం ఏర్పడుతోందని కలెక్టర్ వివరించారు.. పర్యాటక రంగంలోనూ ఏఐ కీలకపాత్ర పోషిస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో తాము వెళ్లాలనుకునే ప్రాంతాలను శోధించినప్పుడు, వారి ఆసక్తికి అనుగుణంగా సంబంధిత సమాచారం అందుబాటులోకి వస్తోందన్నారు. ప్రయాణికుల బడ్జెట్‌కు అనుగుణంగా టికెట్లు, హోటళ్లు, ప్రయాణ మార్గాలు, పర్యాటక ప్రాంతాలు, టూర్ ప్యాకేజీలను సూచించే విధంగా సాంకేతికత అభివృద్ధి చెందుతోందని కలెక్టర్ తెలిపారు. తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణికులకు దేవస్థానం టికెట్లు, రైలు, విమాన టికెట్లు, హోటల్ బుకింగ్ తదితర సేవలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని, భవిష్యత్తులో వీటిని మరింత స్మార్ట్‌గా, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా అందించేందుకు ఏఐ ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. విమాన ప్రయాణంలో సాంకేతిక పరిజ్ఞానం వల్ల ప్రయాణికులకు మరింత సౌకర్యం ఏర్పడుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. డిజియాత్ర వంటి సదుపాయాల ద్వారా ప్రయాణికుల గుర్తింపు, బయోమెట్రిక్ వివరాలు, టికెట్, బోర్డింగ్ పాస్ వంటి అంశాలను డిజిటల్‌గా అనుసంధానించడం ద్వారా విమానాశ్రయాల్లో క్యూలను తగ్గించి వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించే అవకాశం ఏర్పడిందన్నారు. కర్నూలుకు విమానాశ్రయం ఉండటం, బెంగళూరు–హైదరాబాద్ నగరాలకు సమీపంలో ఉండటం కూడా జిల్లాకు అనుకూల అంశాలని, విమానాశ్రయం అందుబాటులో ఉండటం వల్ల పర్యాటకులతో పాటు పరిశ్రమలు కూడా జిల్లాకు ఆకర్షితమయ్యే అవకాశం ఉందన్నారు.
జపాన్‌లో ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తమతో పాటు తీసుకెళ్లి తడి, పొడి చెత్తను వేరు చేసి నిర్వహించే విధానాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, అదే విధంగా మన ప్రాంతాల్లోనూ ప్రజల ప్రవర్తనలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ ద్వారా పబ్లిక్ టాయిలెట్లు, మార్కెట్ ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్లు, రహదారులు, డ్రెయిన్లను శుభ్రం చేయడం జరిగిందని, అయితే ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలు తిరిగి చెత్త వేస్తే ఆశించిన ఫలితాలు సాధించలేమని కలెక్టర్ పేర్కొన్నారు.
యువత, ముఖ్యంగా విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా నిర్దిష్ట లక్ష్యాలను ఏర్పరుచుకుని కష్టపడి చదవాలన్నారు. మొబైల్ ఫోన్లను అనవసర వినియోగానికి కాకుండా విజ్ఞానం, నైపుణ్యాల పెంపుదలకు ఉపయోగించుకోవాలని తెలిపారు. అమ్మాయిలకు ఉన్నత విద్య అందించి, వారు తమకు నచ్చిన రంగంలో కెరీర్‌ను ఎంచుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు.
అనంతరం నృత్యం చేసిన వారికి, వ్యాస రచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మెమెంటో, ప్రశంస పత్రాలను కలెక్టర్ అందచేశారు..
కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి తిరుమల నాయుడు, సెట్కూర్ సీఈవో వేణుగోపాల్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సురేష్, మత్స్య శాఖ అధికారి రంగనాథ్, ఆర్ ఐ ఓ లాలప్ప, తదితరులు
పాల్గొన్నారు