శక్తి స్వరూపిణి పోలేరమ్మ తల్లి జాతర వైభవానికి వేళాయె -పొదలకూరు పోలేరమ్మ తల్లి జాతరకు మంత్రి ఆనంకు ఆహ్వానం!
శక్తి స్వరూపిణి పోలేరమ్మ తల్లి జాతర వైభవానికి వేళాయె
-పొదలకూరు పోలేరమ్మ తల్లి జాతరకు మంత్రి ఆనంకు ఆహ్వానం!
-ఆధ్యాత్మిక శోభతో ముస్తాబవుతున్న పొదలకూరు..
పొదలకూరు, మేజర్ న్యూస్:
నమ్మి కొలిచిన భక్తులను చల్లగా కాపాడే పొదలకూరు గ్రామదేవత, పరాశక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాలు అక్టోబర్ 6, 7, 8వ తేదీలలో ఆధ్యాత్మిక శోభతో అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఊరంతా ఆధ్యాత్మిక ఉత్సవ శోభను సంతరించుకుంటున్న ఈ తరుణంలో, రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డికి జాతర మహోత్సవ దివ్య ఆహ్వాన పత్రికను దేవాదాయ శాఖ అధికారులు, పొదలకూరు గ్రామ పెద్దలు మర్యాద పూర్వకంగా అందజేశారు.గ్రామ దిగ్బంధనంతో ప్రారంభమై, వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల అమ్మవారి నామస్మరణల మధ్య సాగే ఈ దివ్య జాతరకు విచ్చేసి, అమ్మవారి దర్శనం చేసుకుని కృపాకటాక్షాలు పొందాల్సిందిగా మంత్రిని వారు కోరారు.
ఆధ్యాత్మిక వాతావరణంలో ఆహ్వాన పత్రికను స్వీకరించిన మంత్రి ఆనం సంతోషం వ్యక్తం చేశారు. అమ్మవారి దివ్యానుగ్రహంతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అలాగే జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఆధ్యాత్మిక నిష్ఠతో అన్ని ఏర్పాట్లనూ అత్యంత ఘనంగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు.
పొదలకూరు ప్రాంతాన్ని సకల శుభాలతో నింపే ఈ జగజ్జనని పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవంలో భక్తులందరూ విశేషంగా పాల్గొని, అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ శక్తి స్వరూపిణి దివ్యాశీస్సులు పొందాలని ఉత్సవ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు కోరారు.