వైకాపా ఎంపీటీసీ సభ్యుడు కిడ్నాప్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలి : ఎంపిపి ఎన్నికను ప్రభావితం చేసేందుకే కిడ్నాప్ : ఎస్పీకి ఫిర్యాదు చేసిన డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి,వి.ఎస్.రెడ్డి
మదనపల్లె,మేజర్ న్యూస్ : నియోజకవర్గంలోని రామసముద్రం మండలానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు విజయకుమార్‌ను బుధవారం మధ్యాహ్నం బెంగళూరు లోని వైట్ ఫీల్డ్ లోని సురక్ష స్టే హోటల్ వద్ద తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని మాజీ శాసన సభ్యులు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్ రెడ్డి తెలిపారు.నేడు జరుగనున్న మండల పరిషత్ అధ్యక్షుడి ఎన్నికను ప్రభావితం చేయడంతోపాటు,ఎంపీటీసీ సభ్యులపై ఒత్తిడి తెచ్చి ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ ఘటన జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.ఈ ఘటనపై అన్నమయ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ,కిడ్నాప్‌కు గురైన విజయకుమార్ ఆచూకీని తక్షణమే గుర్తించి,ఆయనను సురక్షితంగా విడిపించాలని కోరినట్లు తెలిపారు.కిడ్నాప్‌కు పాల్పడిన వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని,లాడ్జ్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి సమగ్ర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలో ఎంపీటీసీ సభ్యులందరూ ఎలాంటి బెదిరింపులు,ప్రలోభాలు,రాజకీయ ఒత్తిళ్లకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకునేలా పోలీసు యంత్రాంగం తగిన భద్రత కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో విజయకుమార్ తల్లి లక్ష్మీదేవి,అన్న చరణ్ కుమార్,గంగాధర్,గురుశేఖర్,వెంకటేష్,మణీంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి