వైఎస్సార్‌సీపీలోకి 20 కుటుంబాల చేరిక
శ్రీకాకుళం, సూర్య : గార మండలం కొర్ని గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరింది. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు పీసా గోపి ఆధ్వర్యంలో 20 కుటుంబాలు పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే, శ్రీకాకుళం వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి, యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు, అక్రమాలు చోటుచేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ గొంతు విప్పాలని పిలుపునిచ్చారు. ప్రజల అవసరాలను తీర్చే పాలన కోసం ప్రభుత్వాలను ప్రశ్నించాలని, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యతిరేకించాలని సూచించారు.
ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన 160 హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాల్సిన బాధ్యతను విస్మరిస్తోందని విమర్శించారు. ఓటు వేయలేదనే కారణంతో సంక్షేమ పథకాలు తొలగిస్తామంటూ ప్రజలను బెదిరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో పోటీ చేసే స్వేచ్ఛ, హక్కు ఉండాలని, నామినేషన్ల ఉపసంహరణకు పోలీసుల ద్వారా ఒత్తిళ్లు తీసుకురావడం, బెదిరింపులకు పాల్పడటం వంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని వ్యాఖ్యానించారు.
కొర్ని, కొర్లాం వంటి వ్యవసాయ ఆధారిత గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ, రైతులకు కనీసం యూరియా అందుబాటులో ఉంచలేని పరిస్థితి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఎరువులు అందించే విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు కొనసాగించడం లేదని ప్రశ్నించారు.
అలాగే అర్హులైన పెన్షన్‌దారులకు పింఛన్లు అందించే విషయంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న విధానాలకు పొంతన లేకుండా పోయిందన్నారు.
ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, సంక్షేమ పథకాల పేరుతో బెదిరించడం, వారి ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం సరైన పాలన కాదని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ప్రజల హక్కులు, రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.