వామ్మో పెద్ద పులి..వేలేరుపాడు అడవుల్లో సంచారం
వేలేరుపాడు,మేజర్ న్యూస్ : మరోదఫా ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు అడవుల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది.మండలంలోని నార్లవరం గ్రామ పంచాయతీ కొత్తూరు గ్రామ సమీపంలో ఆవు,రెండు దూడలను హతమార్చిన సంఘటన మంగళ వారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.దీంతో ఏజెన్సీ వాసులలో భయాందోళన నెలకొంది.కొత్తూరు గ్రామానికి చెందిన కరటం బ్రహ్మయ్య అనే గిరిజనుడికి చెందిన ఒక ఆవు,రెండు దూడలపై పెద్దపులి దాడిచేసి చంపేసింది.
పెద్ద పులిని బందించేందుకు ఫారెస్ట్ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది.గత జూలై నెలలో మండలంలోని యడవల్లి అడవుల్లో పెద్దపులి సంచరిస్తూ చింతల పాడు గ్రామ సమీపంలో ఆవు ను హతమార్చడంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమై పెద్దపులిని బందించేందుకు బోను సిద్ధం చేశారు.తర్వాత కొన్ని నెలలకు తెలంగాణ రాష్ట్రంలోని కావిడిగుండ్ల అటవీ ప్రాంతంలో సంచరిస్తూ పాపికొండల అభయారణ్యంలోకి వెళ్ళిపోయినట్లు పులికి అమర్చిన రేడియో కాలర్ సిగ్నల్ ద్వారా గుర్తించారు.దీంతో ఫారెస్ట్ అధికారులు, మరోపక్క ప్రజలు పెద్దపులి బెడద గురించి పూర్తిగా మర్చిపోయారు. ప్రస్తుతం మళ్ళీ మండలంలో పెద్దపులి సంచరిస్తుండటంతో ఫారెస్ట్ అధికారుల బృందం అప్రమత్తమై ఏజెన్సీ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.పులి సంచారంతో రాత్రి వేళ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామాల సమీపంలో పెద్ద పులి తిరుగుతుండటంతో గ్రామాలన్నీ నిర్మానుష్యంగా మారాయి.గడిచిన జనవరి నెల నుండి వేలేరుపాడు,బుట్టాయి గూడెం,కావడి గుండ్ల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తూ అనేక పశువులను హతమార్చింది.తాజాగా కొత్తూరు గ్రామ సమీపంలో మూడు పశువులు మృతి చెందిన ప్రదేశంలో పులి పాద ముద్రలను ఫారెస్ట్ అధికారులు సేకరించారు.ఎప్పటికప్పుడు పులి కదలికలను రేడియో కాలర్ సిగ్నల్ ద్వారా కనుగొనేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.ఈ సారైనా పెద్ద పులి పట్టుబడుతుందా..మళ్ళీ ఫారెస్ట్ అధికారుల కళ్లుగప్పి సిగ్నల్ కు అందని ప్రదేశంలో గల పాపికొండల అభయారణ్యంలోకి వెళ్ళిపోతుందా అనే ఉత్కంఠ ఏజెన్సీలో నెలకొంది.చీకటి పడితే అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.