ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి గడువు అర్హులైన ఉపాధ్యాయులు ఫారం-19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్ నాగరాణి
భీమవరం, సూర్య న్యూస్: తూర్పు–పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునేందుకు అర్హులైన ఉపాధ్యాయులు నవంబర్ 6వ తేదీలోగా ఫారం-19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు.సోమవారం భీమవరం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటరు జాబితాల తయారీపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఓటరు జాబితాల తయారీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.2027 మార్చి 29తో ప్రస్తుత ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త ఓటరు జాబితాల తయారీ చేపట్టినట్లు తెలిపారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులు భారత పౌరులై ఉండటంతోపాటు, సంబంధిత నియోజకవర్గంలో నివసిస్తూ, 2026 నవంబర్ 1 నాటికి గత ఆరేళ్లలో కనీసం మూడేళ్లు ఉన్నత పాఠశాల లేదా కళాశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసినట్లు ధ్రువీకరణ పత్రం సమర్పించాలని వివరించారు.ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న అర్హులైన ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు అవగాహన కల్పించాలని సూచించారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన వారి పేర్లనే ఓటరు జాబితాలో చేర్చాలని అధికారులను ఆదేశించారు.దరఖాస్తులు, ఇతర వివరాల కోసం www.ceoandhra.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని, సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1950 లేదా స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పి. గ్లోరియా, జిల్లా విద్యాశాఖ అధికారి అనిల్ కుమార్, వివిధ పాఠశాలలు, కళాశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
రిపోర్టర్ శ్రీనివాస్ భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా