BREAKING
ఎన్‌హెచ్‌–44 ఆరు లేన్ల విస్తరణ పనులను సమన్వయంతో వేగవంతం చేయాలి* 80 శాతం రాయితీపై ఉలవ విత్తనాలు వరి పంటకు మోగి పురుగు నివారణకు స్ప్రే మూడో వన్డేలో రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ తీవ్రంగా నష్టపోయిన పొగాకు రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.. పెళ్లిపీటలెక్కిన ప్రముఖ హాలీవుడ్ నటి ఎమ్మా రాబర్ట్స్.. కోడీ జాన్‌తో వివాహం ఖరారు, ఫొటోలు వైరల్ మున్నూరు కాపు సంఘం ఖమ్మం నగర అధ్యక్షులుగా రాపర్తి శరత్ ఇరగవరం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన వీక్ష ది స్కూల్లో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్ ప్రజా పాలన అంటే ప్రజలకు మాట ఇచ్చి మర్చిపోయే పాలన. మంత్రి మాట లెక్కచేయని గ్రామ కాంగ్రెస్ నాయకులు నస్పూర్‌ రోడ్డు ప్రమాదంలో మరో మహిళ మృతి తెలంగాణ బీజేపీ నూతన సంఘటన మంత్రికి సరిహద్దుల్లో ఘన స్వాగతం. రజినీకాంత్ సినిమాతో క్లాష్‌కు చెక్.. కొత్త తేదీని ప్రకటించిన మమ్ముట్టి, ధనుష్ ‘ఓం’ చిత్ర యూనిట్ పరిశుభ్రతతోనే ఆరోగ్యం.. ఉత్పాదకతకు బాట - స్పెషల్ క్యాంపెయిన్‌–6లో జీఎం ఎన్‌. రాధాకృష్ణ పిలుపు

ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి వి.బి.జి. రామ్‌జీ కొత్త చట్టాన్ని రద్దు చేయాలి

Select Suryaa Now
ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి  వి.బి.జి. రామ్‌జీ కొత్త చట్టాన్ని రద్దు చేయాలి

అనంతపురం బ్యూరో : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వి.బి.జి. రామ్‌జీ కొత్త చట్టాన్ని వెంటనే రద్దు చేసి పాత చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.

వలసల నివారణలో ఉపాధి హామీ పథకం కీలకం

ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు, వలసలను నివారించడంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కీలక పాత్ర పోషించిందన్నారు. 2004లో అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లిలో ఈ పథకాన్ని అమలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల పూడికతీత, కాలువల మరమ్మతులు వంటి పనుల ద్వారా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ పథకం దోహదపడిందని పేర్కొన్నారు.

గతంలో ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం నిధులు సమకూర్చేవని నాయకులు తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం నిధులు భరించాల్సి వస్తోందని విమర్శించారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వాలపై అదనపు భారం పడితే ఉపాధి పనుల అమలుకు ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

కార్మికుల ఉపాధికి విఘాతం కలిగించొద్దు

ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పని కల్పించే విధానంలో మార్పులు గ్రామీణ పేదల జీవనోపాధిపై ప్రభావం చూపుతాయని నాయకులు అన్నారు. కొత్త చట్టం వల్ల ఉపాధి అవకాశాలు తగ్గి, కార్మికులు తక్కువ వేతనాలకు పరిశ్రమల్లో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా విధానాలు రూపొందిస్తున్నారని విమర్శించారు.

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే చర్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని, గ్రామీణ పేదలకు ఉపాధి భద్రత కల్పించే పాత చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించకపోతే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం, వలసలు మరింత పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాలు ఉధృతం

వి.బి.జి. రామ్‌జీ కొత్త చట్టాన్ని వెంటనే రద్దు చేసి, పాత ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో బలమైన ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణ, జిల్లా అధ్యక్షుడు రాయుడు, జిల్లా కమిటీ సభ్యుడు సంజప్ప, ఐఎఫ్‌టీయూ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు ఎర్రిస్వామి, టౌన్ కమిటీ సభ్యుడు లక్ష్మీనారాయణ, పట్టణ పేదల సంఘం జిల్లా అధ్యక్షుడు వీరనారప్ప, టౌన్ కమిటీ సభ్యుడు మున్నా, కటారి రాజు, సీపీఎం నాయకుడు కృష్ణమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, సీపీఐ నాయకుడు రామాంజనేయులు, అంబేద్కర్ కాలనీకి చెందిన అంజి, జయమ్మ, శోభక్క తదితరులు పాల్గొన్నారు.

— రైతు సంఘాల ఐక్యవేదిక, అనంతపురం జిల్లా కమిటీ