BREAKING
అటవీ అమరవీరుల త్యాగం సిరస్మరణీయం ప్రతిరోజూ ఉదయం సోంపు వాటర్ తాగుతున్నారా.. అయితే ఈ ఆరోగ్య రహస్యాలు మీకోసమే! పాత కొమ్ముగూడెంలో పలు నిర్మాణ పనులకు శ్రీకారం చలికాలంలో ఈ ఏడు పొరపాట్లు అస్సలు చేయకండి.. చిన్న నిర్లక్ష్యమే పెద్ద అనారోగ్యానికి దారితీస్తుంది! ప్రతి రోజు ఒక గ్లాసు పసుపు పాలు తాగుతున్నారా.. అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీకోసమే! బిక్కవోలు జనసేనకు 100% విజయం 400 క్వింటాల సబ్సిడీ సెనగ ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా ఏఐ ఏజ్-చెక్: గ్లోబల్ విస్తరణ మహిళా భవన్ నిర్మాణానికి భూమి పూజ. జాతీయ లోక అదాలత్ ను జయప్రదం చేయాలి అండాల సేకరణ అక్రమ దందాపై సర్కారు ఉక్కుపాదం తాగునీటి సరఫరా పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు నజీబ్ రజాక్ గృహ నిర్బంధానికి కోర్టు అనుమతి: మలేషియాలో సంచలనం ప్రవచన మండపం ముందు భవనం ఎత్తు పెంపు కేటీఆర్‌నుమర్యాదపూర్వకంగా కలిసిన గోలి శ్రీనివాస్ రెడ్డి

తండ్రి పేరు తప్పనిసరి నిబంధనను తొలగించాలి

Select Suryaa Now
తండ్రి పేరు తప్పనిసరి నిబంధనను తొలగించాలి

విజయవాడ, మేజర్ న్యూస్: ప్రభుత్వ దరఖాస్తులు, అధికారిక రికార్డులు, ధ్రువీకరణ పత్రాల్లో చట్టపరంగా తప్పనిసరి కాని సందర్భాల్లో తండ్రి పేరు నమోదు చేయాలనే నిబంధనను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (AP SCPCR) పిలుపునిచ్చింది. తండ్రి పేరు లేని కారణంగా ఏ చిన్నారికీ విద్య, ఉపకార వేతనాలు, గుర్తింపు పత్రాలు, సంక్షేమ పథకాలు, ఇతర ప్రభుత్వ సేవలు దూరం కాకూడదని కమిషన్ చైర్మన్ వెటుకూరి ఏ.వి.ఎస్.ఎస్.ఎన్. రాజు స్పష్టం చేశారు.

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌లో మంగళవారం చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సంయుక్తంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యశాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి చిన్నారికి స్వతంత్ర హక్కులు, గౌరవం, గుర్తింపు ఉంటాయని, తల్లిదండ్రుల వైవాహిక స్థితి లేదా కుటుంబ పరిస్థితుల ఆధారంగా పిల్లల భవిష్యత్తును నిర్ణయించకూడదని పేర్కొన్నారు. ఒంటరి తల్లులు, అవివాహిత మహిళలు, వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, చట్టబద్ధ సంరక్షకుల వద్ద పెరుగుతున్న పిల్లలు తండ్రి పేరు తప్పనిసరి నిబంధనతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తండ్రి పేరుకు బదులుగా తల్లి లేదా చట్టబద్ధ సంరక్షకుల పేరును అనుమతించాలని, ప్రభుత్వ దరఖాస్తులు, ఆన్‌లైన్ పోర్టళ్లలో అవసరమైన మార్పులు చేయాలని సూచించారు. తండ్రి పేరు లేదనే కారణంతో పాఠశాల ప్రవేశాలు, ఉపకార వేతనాలు, సంక్షేమ పథకాలు, ఇతర సేవలను నిరాకరించకూడదని, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. పిల్లల కుటుంబ పరిస్థితులను పదేపదే ప్రశ్నించడం ద్వారా వారిలో అవమాన భావన, మానసిక ఆందోళన కలిగించకుండా వ్యక్తిగత గోప్యతను కాపాడాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ, అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి ఏ చిన్నారికీ విద్య, ఇతర అవకాశాలు దూరం కాకుండా సమగ్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో ఒకే విధమైన బాలల హిత పరిపాలనా విధానాన్ని అమలు చేయాలని సూచించారు. చట్టపరంగా అనుమతించబడిన సందర్భాల్లో తండ్రి పేరుకు బదులుగా తల్లి లేదా సంరక్షకుల వివరాలను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించాలని, దీనిపై ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు లేదా పరిపాలనా మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తండ్రి పేరు తప్పనిసరి నిబంధనను తొలగించడం తండ్రుల హక్కులు, బాధ్యతలను నిరాకరించడం కాదని, పిల్లల గౌరవం, సమానత్వం, గుర్తింపు హక్కులను పరిరక్షించడమే లక్ష్యమని కమిషన్ స్పష్టం చేసింది.

ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.కె. విజయలక్ష్మి, విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ రామారావు, జువైనల్ వెల్ఫేర్ శాఖ అధికారులు పి. రమణారెడ్డి, వసంతబాల, ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శిరీష, పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ వి.ఎస్. సుబ్బారావు, ఏలూరు బాలల సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ పి.వి. రావు, చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమంత్ కుమార్, హెల్ప్ డైరెక్టర్ ఎన్.వి.ఎస్. రామ్మోహన్, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు వి. గాంధీబాబు, చల్లా మధుసూదనరావు, పి. నాగమానస, ఫౌండేషన్ ప్రోగ్రామ్ మేనేజర్ జెనిఫర్ వై, వివిధ జిల్లాల బాలల సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.