పల్లెల్లో అభివృద్ధి వెలుగులు!
29న పల్లె పండుగ–3.0కి శ్రీకారం
రూ.11,085 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో భారీగా అభివృద్ధి పనులు
ఉదయగిరిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ప్రారంభం
6 వేల కి.మీ. సీసీ రోడ్లు.. 9,500 కి.మీ. బీటీ రోడ్ల నిర్మాణం
22 వేల మినీ గోకులాలు.. 50 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల పెంపకం
గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయింపు
సూర్య, స్టేట్ బ్యూరో :
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మరింత బలోపేతం చేసి పల్లెల్లో అభివృద్ధి వెలుగులు నింపే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పల్లె పండుగ–3.0కు శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 29న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేతుల మీదుగా అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. పల్లె పండుగ–3.0 కింద మొత్తం రూ.11,085 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందులో రూ.2,700 కోట్లతో 6 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, రూ.7,550 కోట్లతో 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. పాడి రైతులకు అండగా నిలిచేందుకు రూ.300 కోట్లతో 22 వేల మినీ గోకులాల నిర్మాణం చేపట్టనున్నారు. ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ ద్వారా రూ.225 కోట్లతో 50 వేల ఎకరాల్లో తోటల పెంపకానికి చర్యలు తీసుకోనున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు రూ.110 కోట్లతో వెయ్యి కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టనున్నారు. మరో రూ.200 కోట్లతో బస్ షెల్టర్లు, గ్రామ పంచాయతీ భవనాలు, రచ్చబండలు తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మొత్తం రూ.11,085 కోట్లలో కేంద్ర వాటాగా రూ.5,391 కోట్లు, రాష్ట్ర వాటాగా రూ.5,694 కోట్లు వెచ్చించనున్నారు. వీబీ–జీ రామ్ జీ కింద రూ.1,750 కోట్లు, గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కింద రూ.3,800 కోట్లు, నాబార్డ్, సాస్కీ, ఇతర నిధుల ద్వారా మరో రూ.2 వేల కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పల్లె పండుగ–1.0 కింద 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 22,514 పశువుల షెడ్లు, 21 వేల వ్యవసాయ పంట కుంటలు, 64 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల పెంపకం చేపట్టారు. పల్లె పండుగ–2.0లో 2,500 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 8,300 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 15,750 పశువుల షెడ్లు, 15,500 పశువుల నీటి తొట్టెలు, 86 వేల వ్యవసాయ కుంటలు, 82 వేల వ్యక్తిగత సోక్ పిట్లు, 32 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టారు. తాజాగా పల్లె పండుగ–3.0 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తృతంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.