రేపటి నుంచి మూడ్రోజులు బ్యాంకులు బంద్..!
న్యూ ఢిల్లీ :దేశవ్యాప్తంగా రేపటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను పరిష్కరించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.
మూడు రోజుల సమ్మె నేపథ్యంలో నేడు బ్యాంకులు పనిచేయనున్నాయి. ఖాతాదారులు తమకు అవసరమైన బ్యాంకు లావాదేవీలను వీలైనంత వరకు ఇవాళే పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. సమ్మె ప్రభావంతో శాఖల్లో నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్ వంటి ప్రత్యక్ష సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.
మరోవైపు, బ్యాంకులు వరుసగా మూసివేయనున్న నేపథ్యంలో సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బ్యాంకు సేవల పేరుతో నకిలీ సందేశాలు, లింకులు పంపి ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు, కార్డు వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు తెలుసుకునే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు. తెలియని లింకులపై క్లిక్ చేయకుండా, ఓటీపీ లేదా బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని పోలీసులు సూచిస్తున్నారు.