విజయవాడలో ఉద్రిక్తత.. పోలీసుల దిగ్బంధనాన్ని ఛేదించి లెనిన్ సెంటర్‌కు దూసుకెళ్లిన సచివాలయ ఉద్యోగులు
సూర్య విజయవాడ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సచివాలయ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. జిల్లా ఎస్పీలు, కలెక్టర్లు ప్రెస్ మీట్లు పెట్టి తీవ్ర హెచ్చరికలు జారీ చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ముందస్తు నిర్బంధాలు విధించినప్పటికీ.. వాటిని లెక్కచేయకుండా సచివాలయ ఉద్యోగులు విజయవాడలో ప్రత్యక్షమయ్యారు.
ధర్నా చౌక్‌లో నిరసన కార్యక్రమం తలపెట్టిన ఉద్యోగులను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ధర్నా చౌక్‌కు వచ్చే అన్ని మార్గాలను బారికేడ్లతో పూర్తిగా మూసివేసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ పోలీసుల వలయాన్ని ఒక్కసారిగా ఛేదించుకుంటూ ముందుకు కదిలిన వేలాది మంది ఉద్యోగులు లెనిన్ సెంటర్ వైపు దూసుకెళ్లారు.
లెనిన్ సెంటర్‌కు భారీ సంఖ్యలో తరలివచ్చిన సచివాలయ ఉద్యోగులు నడిరోడ్డుపై బైఠాయించి తమ సమస్యలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పెద్దెత్తున నినాదాలు చేశారు. పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను ధిక్కరించి ఉద్యోగులు రోడ్డెక్కడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.