తీర్థయాత్ర మృతులకు ఎమ్మెల్యే నివాళులు
పెద్దపంజాణి, మేజర్ న్యూస్:
పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం మేలుమాయి క్రాస్‌కు చెందిన శ్రీనివాసులు, దేవిశ్రీ దంపతులు తీర్థయాత్రకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందడం పట్ల పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో మృతి చెందిన వారికి ఆయన ఘనంగా నివాళులర్పించారు.కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రకు వెళ్లిన శ్రీనివాసులు, దేవిశ్రీలు ఒడిశా రాష్ట్రంలోని బైతరణి నదిలో స్నానం చేస్తుండగా, వారి మనవరాలు ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండటాన్ని గమనించారు. చిన్నారిని కాపాడే ప్రయత్నంలో వారిద్దరూ నదిలో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.శుక్రవారం మధ్యాహ్నం మృతదేహాలు స్వగ్రామానికి చేరుకున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మేలుమాయి క్రాస్‌కు చేరుకున్నారు. మృతుల భౌతికకాయాలపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం మృతుల కుటుంబ సభ్యులను కలిసి ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ కష్ట సమయంలో వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబానికి జరిగిన తీరని నష్టంపై విచారం వ్యక్తం చేసి ధైర్యంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సోమశేఖర్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, వేణు, శ్రీనివాసులు, రాకేష్, సెల్వ తదితరులు పాల్గొన్నారు.
ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి రిపోర్టర్ పెద్దపంజాణి