BREAKING
ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధికి బాటలు వేస్తా భారత్‌–అమెరికా సంబంధాలకు ప్రజాస్వామ్య సంస్థలే బలమైన పునాది: లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఇటలీ అంతర్జాల దాడులకు బాధ్యులెవరో స్వతంత్రంగా నిర్ధారించాల్సి ఉంది.. సాంకేతిక దర్యాప్తులో కీలక అంశాలు! ఏపీలో 601 ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు పూర్తి.. ఒకే రోజు థియేటర్లలో మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు! పొన్నూరు 37వ వార్డులో జోరందుకున్న వైసీపీ ఎన్నికల ప్రచారం ప్రచారంలో పాల్గొన్న వైసీపీ చైర్మన్ అభ్యర్థి షేక్ నాజిని సిద్ధిపేట.. ఇక కాంగ్రెస్ అడ్డా.. బ్యాచులర్ పార్టీ డ్యూక్స్ రివ్యూ.. 14 ఏళ్ల తర్వాత అమల్ నీరద్ స్టైలిష్ యాక్షన్ ఎలా ఉందంటే? అన్నారంలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ రుద్ర సహిత కాలబైరవ మహా యజ్ఞంకు విస్తృత ఏర్పాట్లు ఓం సినిమాకు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్.. తెలుగు వెర్షన్‌కే అగ్రస్థానం! శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం శరీరానికి ఉపవాసం..మనసుకు నామస్మరణ.. ఆత్మకు ఆధ్యాత్మిక చింతన..అనుగ్రహించేదే.. మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం హెయిల్ మేరీ నుంచి మారివిల్ చిరకే వీడియో సాంగ్ విడుదల.. సూరజ్ వెంజారమూడు భావోద్వేగ నటన!

టీడీపీ హ్యాపీ.. వైసీపీకి బీపీ!

Select Suryaa Now
టీడీపీ హ్యాపీ.. వైసీపీకి బీపీ!
  •  

విజయనగరం బ్యూరో, సూర్య: జిల్లాలో వైసీపీకి మరో పరాభవం ఎదురైంది. ఇటీవలి మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న ఆపార్టీకి గురువారం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లోనూ ఎదురుగాలి తప్పలేదు. దీంతో, ఆపార్టీ మనుగడపైనే అనేక సందేహాలు ముసురుకుంటున్నాయి.  సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన పరాజయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు మరోసారి ఆ పార్టీకి ప్రతికూలంగా మారాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన వైసీపీ, పరిషత్ ఎన్నికల్లోనూ వెనుకబడింది. తాజాగా గురువారం జరిగిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల్లోనూ కూటమి పార్టీలే ఆధిపత్యం ప్రదర్శించాయి. మొత్తం 27 మండలాల్లో జరిగిన పరోక్ష ఎన్నికల్లో వైసీపీకి ఆశించిన స్థాయిలో ప్రాతినిధ్యం దక్కలేదు. ముఖ్యంగా ఎంతో ఉత్కంఠ రేపిన నెల్లిమర్ల, పూసపాటిరేగ, డెంకాడ, గుర్ల మండలాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. భోగాపురంలో ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది.

  • గతమెంతో ఘనం..వర్తమానం..?
    జిల్లాలో వైసీపీ రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే గతానికి, ప్రస్తుతానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ఒకప్పుడు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీకి బలమైన కేడర్, నాయకత్వం ఉండేది. అధికారంలో ఉన్న సమయంలో స్థానిక సంస్థల్లోనూ గణనీయమైన ప్రాతినిధ్యం సాధించింది. అయితే సార్వత్రిక ఎన్నికల అనంతరం పరిస్థితులు మారిపోయాయి. నాయకుల వలసలు, అంతర్గత విభేదాలు, కేడర్‌లో నిరుత్సాహం వంటి అంశాలు పార్టీని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
    ఈ నేపథ్యంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. అనంతరం జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఆ పార్టీకి అనుకూలంగా ముగియలేదు. జిల్లాలోని 27 జెడ్పీటీసీ స్థానాలకు గాను కూటమి 22 స్థానాలను కైవసం చేసుకోగా, వైసీపీ ఐదు స్థానాలకే పరిమితమైంది. ఇందులో టీడీపీ 20, జనసేన రెండు స్థానాల్లో విజయం సాధించాయి. వైసీపీకి కంచుకోటగా భావించిన ప్రాంతాల్లోనూ ఫలితాలు మారడం గమనార్హం.
    తాజాగా జరిగిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు జిల్లాలో రాజకీయ సమీకరణాలను మరోసారి స్పష్టం చేశాయి. 95శాతం మండలాల్లోనూ కూటమి అభ్యర్థులు ఆధిపత్యం ప్రదర్శించారు. ముఖ్యంగా ఇరు పక్షాల మధ్య గట్టి పోటీ నెలకొన్న ఐదుమండలాల్లో నాలుగింట టీడీపీ అభ్యర్థులు మిత్రపక్షాల మద్దతుతో విజయం సాధించడం విశేషం. స్థానికంగా నెలకొన్న రాజకీయ పోటీ, సభ్యుల మద్దతు కూడగట్టుకోవడంలో కూటమి నాయకులు అనుసరించిన వ్యూహాలు ఈ ఫలితాల్లో ప్రతిబింబించాయి.
    కొన్ని మండలాల్లో సంఖ్యాబలం స్పష్టంగా ఉన్నప్పటికీ, మరికొన్ని చోట్ల చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగింది. సభ్యుల మద్దతు ఎటువైపు ఉంటుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయినప్పటికీ కూటమి పార్టీల మధ్య సమన్వయం ఫలించడంతో కీలకమైన స్థానాలను దక్కించుకోగలిగాయి. వైసీపీ మాత్రం గట్టి పోటీ నెలకొన్న ప్రాంతాల్లోనూ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది.
    వ్యూహాత్మక విజయం
    ఈ ఎన్నికల్లో మరో కీలకమైన అంశం కూటమి పార్టీల మధ్య సమన్వయం. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పరస్పరం సహకరించుకోవడం ద్వారా తమ బలాన్ని సమీకరించుకున్నారు. కొన్ని మండలాల్లో టీడీపీకి జనసేన, బీజేపీ సభ్యుల మద్దతు లభించడం విజయానికి దోహదపడింది. ముఖ్యంగా హోరాహోరీ పోటీ నెలకొన్న చోట్ల విడివిడిగా పోటీ చేయకుండా సమష్టిగా వ్యవహరించడం కూటమికి కలిసివచ్చింది.
    మరోవైపు వైసీపీలో మాత్రం స్థానిక నాయకత్వం, కేడర్ సమన్వయం, సభ్యులను ఏకతాటిపైకి తీసుకురావడం వంటి అంశాలు సవాలుగా మారినట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సంఖ్యాబలం ఉన్నచోట కూడా దానిని పదవులుగా మార్చుకోవడంలో పార్టీ నాయకత్వం ఎదుర్కొన్న సవాళ్లు తాజా ఫలితాలతో చర్చకు వస్తున్నాయి.
    వరుస అపశృతులు
    జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు బొత్స సత్యనారాయణ నాయకత్వం వైసీపీకి ప్రధాన బలంగా ఉండేది. అయితే ఇటీవలి పరిణామాలు ఆ పార్టీకి కొత్త సవాళ్లు విసురుతున్నాయి. ముఖ్యంగా చిన్నశ్రీను టీడీపీలో చేరడం, బొత్స కుటుంబానికి చెందిన అభ్యర్థులు సైతం పరిషత్ ఎన్నికల్లో పరాజయాలు ఎదుర్కోవడం వంటి పరిణామాలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.
    చీపురుపల్లి, గరివిడి, గుర్ల వంటి ప్రాంతాల్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. నాయకత్వ మార్పులు, పార్టీ మార్పులు, స్థానికంగా బలమైన నాయకుల వైఖరి వైసీపీపై ప్రభావం చూపుతున్నాయి. ఒకప్పుడు బొత్స కుటుంబ రాజకీయ ప్రభావంతో నడిచిన కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు కొత్త సమీకరణాలు రూపుదిద్దుకుంటున్నాయిఈ పరిణామాలు భవిష్యత్తులో పార్టీ నిర్మాణంపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
    మనుగడపై సందేహాలు
    ఓటు బ్యాంకు స్థిరంగా ఉందని వైసీపీ పెద్దలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ, వరుస ఎన్నికల్లో ఎదురవుతున్న ఫలితాలు వైసీపీ జిల్లా నాయకత్వానికి ఆత్మపరిశీలన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. కేవలం ఎన్నికల సమయంలో ప్రచారం చేయడం, అభ్యర్థులను బరిలోకి దింపడం మాత్రమే సరిపోదు. గ్రామస్థాయిలో కార్యకర్తలను క్రియాశీలంగా ఉంచడం, స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయడం, ప్రజల్లో పార్టీకి ఉన్న సంబంధాన్ని పునరుద్ధరించడం కూడా అంతే ముఖ్యమని హితబోధ చేస్తున్నాయి. మరోవైపు కూటమి పార్టీలకు ఈ వరుస విజయాలు స్థానికంగా తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని విస్తరించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. మున్సిపాలిటీల నుంచి మండల పరిషత్‌ల వరకు వచ్చిన ఫలితాలు గ్రామీణ, పట్టణ రాజకీయాల్లో కూటమి బలాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే భవిష్యత్తు సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు కొలమానం అని భావించలేనప్పటికీ ఒక జిల్లాలో వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో ఒకే పార్టీకి ప్రతికూల ఫలితాలు రావడం ఆ పార్టీ రాజకీయ పరిస్థితిపై చర్చకు దారితీయడం సహజం. మొత్తంగా జిల్లాలో పార్టీని మళ్లీ పటిష్టం చేయడం వైసీపీ నాయకత్వానికి తక్షణ కర్తవ్యంగా మారింది. ఒకప్పుడు జిల్లాలో రాజకీయాలను శాసించిన పార్టీ ఇప్పుడు తన ఉనికిని, కేడర్‌ను, నాయకత్వాన్ని కాపాడుకునే దిశగా ఎలాంటి అడుగులు వేస్తుందో వేచి చూడాలి.