స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి: జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత.
*ఎన్నికల సాధారణ పరిశీలకులు సి.హెచ్. శ్రీధర్‌కు జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లను వివరించిన కలెక్టర్.
*పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు సమగ్ర సౌకర్యాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత.
సూర్య ప్రతినిధి, మార్కాపురం.
మార్కాపురం జిల్లా పరిధిలో ఎన్నికలను పారదర్శకంగా, నిష్పాక్షికంగా మరియు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్, జిల్లా ఎన్నికల అధికారి ఎం. విజయ సునీత స్పష్టం చేశారు.గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి మరియు మార్కాపురం జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు సి.హెచ్. శ్రీధర్‌కు జిల్లాలోని ఎన్నికల సన్నాహాలను కలెక్టర్ సమగ్రంగా వివరించి, సమీక్షించారు.
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు అవసరమైన ఎన్నికల సిబ్బందిని కేటాయించామని, బ్యాలెట్ పెట్టెల లభ్యత, వాటి పనితీరు మరియు భద్రతను తనిఖీ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.ఓటు వేయడానికి వచ్చే ప్రజలు, వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, నీడ కోసం షామియానాలు, ర్యాంప్ వసతులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జిల్లా పరిధిలోని సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను ప్రత్యేకంగా గుర్తించి, అక్కడ అదనపు పోలీస్ బలగాలు, వెబ్‌కాస్టింగ్ మరియు సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసినట్లు వివరించారు.ఓట్ల లెక్కింపు జరిగే కౌంటింగ్ కేంద్రాల వద్ద బహుళ అంచెల భద్రత మరియు నిరంతర సీసీటీవీ నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఎన్నికలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులు, అభ్యంతరాలపై ఎప్పటికప్పుడు స్పందించి తక్షణ పరిష్కారం చూపేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.ఎన్నికల సాధారణ పరిశీలకులు సి.హెచ్. శ్రీధర్ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ అంతా సజావుగా సాగేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఎస్పీ పంకజ్ కుమార్ మీనా, ఓఎస్డీ (అడ్మిన్) నవజ్యోతి మిశ్రా, డిఆర్ఓ శ్రీదేవి, డిపిఓ కుప్పిలి ఫణీంద్ర, మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం. కంచి బాబు తదితరులు పాల్గొన్నారు.