పేదల ఆకలి తీర్చిన పోరాటయోధుడు పండుగ సాయన్న
పటాన్‌చెరు;నిజాం పాలనలో రజాకార్లు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి పేదలు, అణగారిన వర్గాల ప్రజల పక్షాన నిలిచిన బహుజన పోరాటయోధుడు పండుగ సాయన్న ముదిరాజ్ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. పండుగ సాయన్న ఆశయాలు, పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలం దౌల్తాబాద్‌లో నిర్వహించిన పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దౌల్తాబాద్ చౌరస్తా నుంచి ఎస్‌ఎస్‌ఆర్ గార్డెన్స్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. నీలం మధుకు నిర్వాహకులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం జయంతి వేడుకల్లో పాల్గొని పండుగ సాయన్నకు నివాళులర్పించారు.ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముదిరాజుల ఆరాధ్య వీరుడు పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. చరిత్రలో ప్రజల కోసం పోరాడిన మహనీయులకు గుర్తింపు లభించడం ద్వారా వారి త్యాగాలు, పోరాటాలు భావితరాలకు తెలుస్తాయని పేర్కొన్నారు. పండుగ సాయన్న జీవితం పేదల పట్ల బాధ్యత, సామాజిక న్యాయం, సమానత్వం వంటి విలువలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు.ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ప్రజలందరూ పార్టీలు, రాజకీయ విభేదాలకు అతీతంగా ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఐక్యతతోనే సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించగలమని అన్నారు. పండుగ సాయన్న చూపిన పోరాట మార్గం నేటి యువతకు స్ఫూర్తిగా నిలవాలని, ఆయన చరిత్రను ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని ఆకాంక్షించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.పండుగ సాయన్న జయంతి సందర్భంగా దౌల్తాబాద్‌లో పండుగ వాతావరణం నెలకొంది. నిర్వాహకులు చేపట్టిన ర్యాలీలో ముదిరాజ్ సంఘాల నాయకులు, యువకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన జయంతి సభలో పండుగ సాయన్న సేవలు, పోరాటాలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ గుండ్లపల్లి శ్రీనివాస్, కొల్లాపూర్ శ్రీనివాస్, మహేష్, మండల సంఘం అధ్యక్షుడు తలారి రాజేందర్, ఉపాధ్యక్షుడు అంబటి అర్జున్, సర్పంచులు రమేష్, సుజాత సత్యం, కృష్ణ, రాజు, శ్రీనివాస్, ప్రవీణ్, గోపాల్, ఉపసర్పంచ్ ప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కరే కృష్ణ, జిల్లా మాజీ ఫిషరీస్ చైర్మన్ గుణాల నర్సింలు, నాయకులు ఆంజనేయులు, పోచయ్య, మదారం రవి, యాదగిరి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ముదిరాజ్ సంఘం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.