వైయస్సార్ పార్టీ నాయకులు అరాచకం మూల్యం తప్పదు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
శ్రీకాళహస్తి: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా శ్రీకాళహస్తిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య బుధవారం చోటుచేసుకున్న తోపులాట ఘటనపై స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నియోజకవర్గంలో అశాంతి సృష్టించే ప్రయత్నాలను సహించేది లేదని హెచ్చరించారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ఘటనకు సంబంధించి వైసీపీ నాయకులపై పలు ఆరోపణలు చేశారు.
నామినేషన్ కేంద్రం వద్దకు అభ్యర్థితో పాటు కేవలం ఇద్దరిని మాత్రమే అనుమతించాలనే నిబంధన ఉన్నప్పటికీ, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వందలాది మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వచ్చి హంగామా సృష్టించారని బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను దుర్భాషలాడటం, టీడీపీ శ్రేణులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగాల్సిన సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, ఎంపీ గురుమూర్తి, మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి, కుమారుడు ఆకర్ష్ రెడ్డిలపై కూడా ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. వీరంతా కలిసి ప్రశాంతంగా ఉన్న శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అలజడులు సృష్టిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తిరుపతి నుంచి కొంతమందిని తీసుకొచ్చి స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యారని విమర్శించారు.
వైసీపీ నాయకుల మాటలు నమ్మి కార్యకర్తలు తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని బొజ్జల సుధీర్ రెడ్డి సూచించారు. రాజకీయ నాయకుల మధ్య విభేదాల కారణంగా కార్యకర్తలు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదన్నారు. రాజకీయాలు ప్రజాసేవకు వేదిక కావాలే తప్ప, గొడవలు, ఘర్షణలకు కారణం కాకూడదని అభిప్రాయపడ్డారు.
గతంలో తాము ప్రతిపక్షంలో ఉన్న సమయంలో బియ్యపు మధుసూదన్ రెడ్డి తమపై, తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టించారని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కక్షపూరిత రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారని గుర్తుచేశారు.
క్రమశిక్షణ, సంస్కారం ఉన్న పార్టీగా తాము నియోజకవర్గ అభివృద్ధిపైనే ప్రధానంగా దృష్టి సారించామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తమ సంయమనాన్ని బలహీనతగా భావించి ఎవరైనా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలు కూడా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రాజకీయ నాయకులను ప్రోత్సహించవద్దని కోరారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారని ఆయన తెలిపారు. వైసీపీకి నామినేషన్లు వేయడానికి కార్యకర్తలు లేరంటూ కూడా విమర్శలు చేశారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడే భాషను మార్చుకోవాలని, పరుష పదజాలాన్ని ఉపయోగించడం మానుకోవాలని హితవు పలికారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు సృష్టించడం, గొడవలకు పాల్పడటం వంటి చర్యలకు స్వస్తి పలకాలని బొజ్జల సుధీర్ రెడ్డి సూచించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేలా అన్ని పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అల్లర్లు, ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వైసీపీ నాయకులను హెచ్చరించారు.
— వీసీ వెంకటయ్య, సూర్య దినపత్రిక ఇన్‌చార్జి, శ్రీకాళహస్తి