*పిచ్చరాగడి తాండలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ*
కోహీర్;సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని పిచ్చరాగడి పాత తాండ గ్రామ పంచాయతీ ఆవరణలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు గురువారం ఘనంగా భూమిపూజ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కోహీర్ మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు, స్థానిక సర్పంచ్ ప్రతినిధి రాథోడ్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి దళిత, గిరిజన, అంబేద్కర్ సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా దళిత, గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్య, హక్కుల సాధన కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.జహీరాబాద్ నియోజకవర్గంలోని తొలి గిరిజన తాండలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందని నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మహనీయుడి విగ్రహం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూ, ఆయన ఆశయాలను గుర్తుచేస్తుందని తెలిపారు.గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తున్న రాథోడ్ వినోద్ కుమార్ విగ్రహ ఏర్పాటుకు చొరవ తీసుకోవడాన్ని నాయకులు అభినందించారు. గిరిజన తాండలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలనే ఆలోచనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తాండ మాజీ సర్పంచ్ చౌహన్ చందర్, గ్రామ వార్డు సభ్యులు రామావత్ నర్సింలు, రాథోడ్ సంజీవ్ కుమార్, సజ్జాపూర్ ఉపసర్పంచ్ మైసయ్య, నాయకులు లోకనాథం, భ్యగారి అశోక్, టీ. సంజీవులు, ప్రకాష్, సచిన్ తదితరులతో పాటు పలువురు దళిత, గిరిజన సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.