*అల్లం పంటలో కొత్త తెగులు.. కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన!*
కోహిర్;సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, కోహిర్ మండలాల్లో అల్లం సాగు చేస్తున్న పొలాల్లో అగ్గి తెగులును పోలిన కొత్త తెగులు కనిపించడంతో కేంద్ర, రాష్ట్ర స్థాయి వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు, శాస్త్రవేత్తలతో కూడిన సంయుక్త బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలను పరిశీలించింది. తెగులు వ్యాప్తి, లక్షణాలు, నివారణ చర్యలపై రైతులకు పలు సూచనలు చేసింది.కేంద్ర సమగ్ర సస్యరక్షణ కేంద్రం (సీఐపీఎంసీ), హైదరాబాద్ నుంచి వచ్చిన ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారులు వెంకటరెడ్డి, బసవన్నప్ప, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారి ఉదయశంకర్ ఈ బృందంలో పాల్గొన్నారు. సంగారెడ్డి ఫల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మౌనిక, డీడీఎస్-కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శైలజ, స్థానిక ఉద్యాన శాఖ అధికారి సునీత రోస్, ఉద్యాన శాఖ అధికారి సతీష్ తదితరులు పర్యటనలో పాల్గొని అల్లం పంటలను పరిశీలించారు.కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోనూ తెగులు వ్యాప్తి కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఇటీవల ఈ తెగులు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలోనూ అల్లం పంటల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేరళలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఈ తెగులుకు కారణమైన శిలీంధ్రాన్ని.*ప్రాక్సిఫైరిక్యులేరియా జింజిబెరిస్* గా నిర్ధారించినట్లు అధికారులు పేర్కొన్నారు.నివారణకు మందుల పిచికారీ తెగులు నివారణకు ప్రొపికోనజోల్ లేదా టెబుకోనజోల్ మందులను లీటరు నీటికి ఒక మిల్లీలీటరు చొప్పున కలిపి పంటపై పిచికారీ చేయాలని అధికారులు సూచించారు. విత్తన కొమ్ములకు కూడా తగిన విధంగా విత్తన శుద్ధి చేయాలని తెలిపారు. అయితే, మందుల వినియోగానికి సంబంధించి స్థానిక ఉద్యాన శాఖ అధికారుల సూచనలు, మందు లేబుల్‌పై పేర్కొన్న మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.విత్తన కొమ్ముల ఎంపికలో జాగ్రత్త తెగులు సోకిన ప్రాంతాల నుంచి అల్లం విత్తనానికి ఉపయోగించే కొమ్ములను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావద్దని అధికారులు స్పష్టం చేశారు. ఆరోగ్యకరమైన పంట నుంచి నాణ్యమైన విత్తన కొమ్ములను ఎంపిక చేసుకోవాలని, పొలాల్లో తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు.అల్లం సాగు చేసే రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటించి, శాస్త్రవేత్తలు సూచించిన సస్యరక్షణ చర్యలను అమలు చేయడం ద్వారా పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చని అధికారులు తెలిపారు.