స్ట్రాంగ్ రూములను తనిఖీ చేసిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి...
విజయనగరం, సూర్య : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో విజయవంతంగా పూర్తయిందని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఎన్నికలు సాఫీగా, పారదర్శకంగా ముగిసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా విధులు నిర్వహించిన ప్రిసైడింగ్ ఆఫీసర్లు (పీవోలు), అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు (ఏపీవోలు) మరియు శాంతిభద్రతలను సమర్థవంతంగా పరిరక్షించిన పోలీసు సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. స్థానిక రాజీవ్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను కలెక్టర్ తనిఖీ చేశారు. లోపల ఉంచిన బ్యాలెట్ బాక్సులను పరిశీలించారు. పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ను సీల్ చేసి, పటిష్టమైన భద్రతను కల్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలోని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక మరియు సున్నితమైన పోలింగ్ కేంద్రాలన్నింటిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, వెబ్ కాస్టింగ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించామని వెల్లడించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించగలిగామని, వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, ఆర్డీవో రామ్మోహన్, ఇతర అధికారులు ఉన్నారు.