స్థానిక సంస్థల ఎన్నికలు – మన ఓటు- మన బాధ్యత
ప్రొద్దుటూరు మేజర్ న్యూస్: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం వేసే ప్రతి ఓటు మన పట్టణం, మన వార్డు, మన గ్రామ అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం తెలిపారు. వారి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మన ఓటు ఒక్కరోజు కోసం కాదు – రాబోయే ఐదేళ్ల పాలన కోసం అనే విషయాన్ని ప్రతి ఓటరు గుర్తించాలని కోరారు. ధనం, మద్యం, బహుమతులు లేదా ఇతర ప్రలోభాలకు లొంగకుండా, కులం, మతం వంటి భేదాలకు అతీతంగా అభ్యర్థుల వ్యక్తిత్వం, ప్రజాసేవ, గత పనితీరు, ప్రజల పట్ల బాధ్యతలను పరిశీలించి ఆలోచనాత్మకంగా ఓటు వేయాలని అభ్యర్థించారు.
మనం ఎలాంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలి?
ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, పరిష్కారానికి కృషి చేసే వారిని. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వారిని. నిజాయితీ, పారదర్శకతతో పనిచేసే వారిని. ప్రజాధనాన్ని ప్రజల హక్కుగా భావించి, దాని వినియోగంపై జవాబుదారీగా ఉండే వారిని. అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా నిలబడే వారిని. కులం, మతం, ప్రాంతం వంటి భేదాలకు అతీతంగా అందరినీ సమానంగా చూసే వారిని. తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు, ప్రజారోగ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేసే వారిని. స్థానిక సమస్యలపై అవగాహనతో పాటు, ప్రాంత అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళిక కలిగిన వారిని. ఎన్నికల తర్వాత కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండే వారిని ఎన్నుకోవాలని సూచించారు .
- ఓటుకు నోటు వద్దు – ఓటు హక్కును కాపాడుకుందాం
ఈరోజు తీసుకునే డబ్బు కంటే, రాబోయే ఐదేళ్ల మంచి పాలన ఎంతో విలువైనది. ఓటు అనేది అమ్ముకునే వస్తువు కాదు. అది మన రాజ్యాంగం కల్పించిన విలువైన ప్రజాస్వామ్య హక్కు. డబ్బు, మద్యం, బహుమతులు లేదా ఇతర ప్రలోభాలకు లొంగకుండా, అభ్యర్థుల అర్హతలు, వ్యక్తిత్వం, ప్రజాసేవ, గత పనితీరు ఆధారంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు హుస్సేన్ బాష, కార్యదర్శి మహ్మద్ రఫీ, సభ్యులు గౌస్ లాజం, అల్లా బకాష్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.
- షేక్ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లా