స్థానిక సంస్థల ఎన్నికలపై పవన్ కళ్యాణ్ కసరత్తు: నేడు కోఆర్డినేషన్ కమిటీలతో కీలక సమావేశం
అమరావతి, సూర్యప్రతినిధి i: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సీట్ల కేటాయింపు, క్షేత్రస్థాయి సమీకరణలపై చర్చించేందుకు ఆయన నేడు పార్టీ కోఆర్డినేషన్ కమిటీలతో ముఖాముఖి సమావేశం కానున్నారు.
స్థానిక పోరులో మిత్రధర్మాన్ని పాటిస్తూనే, పార్టీ శ్రేణుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా మరియు క్షేత్రస్థాయి కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం దక్కేలా కార్యాచరణ సిద్ధం చేయాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సేకరించిన సమగ్ర నివేదికలను ఈ సమావేశంలో కమిటీ సభ్యులు పవన్ కళ్యాణ్‌కు అందజేయనున్నారు.
ఈ నివేదికల ఆధారంగా పోటీ చేయాల్సిన స్థానాలు, కూటమి భాగస్వామ్య పక్షాలతో సమన్వయం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై జనసేనాని స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల పాత పార్లమెంట్ కమిటీలను రద్దు చేసి సరికొత్త వ్యూహంతో ముందుకు వెళుతున్న జనసేన, ఈ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలు రాబోయే స్థానిక పోరులో అత్యంత కీలక కానున్నాయి.