స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధులు కావాలి -- అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం
ఏలూరు, మేజర్ న్యూస్ : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధులు కావాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ తో కలిసి ఎంపిడిఓ లు, పోలీసు అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో పురపాలక సంఘాలు, జిల్లా పరిషత్ , గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం త్వరలో ఆదేశాలు ఇవ్వనున్న దృష్ట్యా ఏలూరు జిల్లాలో గ్రామ పంచాయతీలలో ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు, పోలింగ్ సామాగ్రి పంపిణీ, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు ముందుగా సిద్ధం చేసుకొని, తనిఖీ చేసుకోవాలన్నారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు రెండు విడతలుగా నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాలను ఎంపిడిఓ, పోలీసు అధికారులు సంయుక్తంగా తనిఖీ చేసి నిబంధనల మేరకు ఉన్నాయా లేదా అనే విషయాన్నీ చూడాలన్నారు. ఏదైనా సమస్యలు ఉంటె ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. పోలింగ్, కౌంటింగ్, పోలింగ్ సామాగ్రి, నిల్వ, పంపిణీ కేంద్రాలలో కాంపౌండ్ వాల్, విద్యుత్, ఇంటర్నెట్ , భద్రత ఏర్పాట్లు ఉండేలా చూడాలన్నారు. జిల్లాలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు నిర్వహణకు భద్రత ఏర్పాట్లకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఎన్నికలు నిర్వహించి ప్రాంతాలలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో భద్రతను మరింత పెంచుతామన్నారు. పోలింగ్ కేంద్రాలలో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, కాంపౌండ్ వాల్స్, విద్యుత్, ఇంటర్నెట్, భవనాల పటిష్టత తప్పనిసరిగా ఉండాలన్నారు.జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్ ఇంచార్జ్ సీఈఓ మల్లికార్జునరావు, ఎంపిడిఓ లు, పోలీసు అధికారులు, పాల్గొన్నారు.
న్యూస్ బ్యూరో కే బాలసౌరి , ఏలూరు