*స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి
విజయనగరం, సూర్య : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్తో కలిసి సంబంధిత అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు మొత్తం 12,944 మంది సిబ్బంది అవసరమని అంచనా వేయగా, ప్రస్తుతం 17,487 మంది సిబ్బందిని ప్రతిపాదించినట్లు తెలిపారు. వివిధ శాఖల నుంచి సిబ్బంది వివరాలను సేకరించి, నిబంధనల ప్రకారం విధులు కేటాయించాలని, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాండమైజేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 121 వార్డులు, 322 పోలింగ్ స్టేషన్లు ఉండగా, మొత్తం 4,91,409 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో అవసరమైన సిబ్బంది, ఎన్నికల సామగ్రి, మౌలిక సదుపాయాలు కల్పించి, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎన్నికల విధుల నుంచి మినహాయింపులు కోరే అభ్యర్థనలను నిబంధనల మేరకే పరిశీలించాలని, గర్భిణులు, ప్రత్యేక వైద్యపరమైన సమస్యలు ఉన్నవారి వివరాలను పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పోలీసు, వైద్య, అత్యవసర సేవల సిబ్బంది విధులను కూడా పరిగణనలోకి తీసుకుని సమర్థవంతంగా సిబ్బంది కేటాయింపులు చేపట్టాలని సూచించారు. ఎన్నికల సిబ్బంది, సామగ్రి తరలింపునకు అవసరమైన బస్సులను సమకూర్చుకుని, రూట్లను ముందుగానే ఖరారు చేయాలని, విశాఖపట్నం నుంచి కేటాయించిన బస్సుల సమీకరణతో పాటు రవాణాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, ఏర్పాట్ల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని తెలిపారు.
ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా, ప్రతి అధికారి తనకు అప్పగించిన బాధ్యతలను సమయపాలనతో పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్. సత్తిబాబు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఇ. మురళి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ లవరాజు, జిల్లా విద్యాశాఖాధికారి యు. మణిక్యంనాయుడు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ప్రసాద్, మున్సిపల్, జీఎస్డబ్ల్యూఎస్, ఆర్టీసీ, అగ్నిమాపక శాఖల అధికారులు, ఇతర సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
రిపోర్టర్ : డేవిడ్ రాజు, విజయనగరం.