స్థానిక ఎన్నికల్లో బోడె ప్రసాద్ రాజకీయ చతురత : టీడీపీ సీనియర్ నాయకులు యలమంచిలి కిషోర్ బాబు
కంకిపాడు, మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ రాజకీయ వ్యూహాలు, చాణక్యం ఫలించాయని కంకిపాడు మండల టీడీపీ సీనియర్ నాయకులు యలమంచిలి కిషోర్ బాబు అన్నారు. సామాన్య ప్రజల ఆకాంక్షలు, స్థానిక పరిస్థితులు, క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలు, పోటీ చేసే అభ్యర్థుల వ్యక్తిత్వాలను సమగ్రంగా పరిశీలించి ధీటైన అభ్యర్థులను బరిలోకి దించడం ద్వారా బోడె ప్రసాద్ తనదైన రాజకీయ చతురతను ప్రదర్శించారని కొనియాడారు. కూటమి పొత్తు ధర్మాన్ని పాటిస్తూనే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను కాపాడుకుంటూ, పార్టీ క్యాడర్‌తో పాటు ఆశావహ అభ్యర్థుల్లో ఎలాంటి వ్యతిరేకత రాకుండా సమన్వయంతో వ్యవహరించడం అభినందనీయమన్నారు. ఈరోజు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మరికొద్ది రోజుల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రత్యర్థులకు నామమాత్రంగా కూడా అభ్యర్థులు దొరకని పరిస్థితి కల్పించారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయాలు, పార్టీ కార్యకర్తల కృషి, ప్రజల విశ్వాసం, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నాయకత్వం కలిసి పెనమలూరు నియోజకవర్గంలో కూటమికి బలమైన పునాది వేశాయని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటూ, కూటమి ఐక్యతను కొనసాగించి మరిన్ని విజయాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.