శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కూటమి ప్రభుత్వం – ఎంపీ గురుమూర్తి
తిరుపతి, రెవెన్యూ, మేజర్ న్యూస్.
శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కూటమి ప్రభుత్వం – ఎంపీ గురుమూర్తి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అక్రమ అరెస్టులు, నిర్బంధాలు ఆపాలి – స్వేచ్ఛాయుత ఎన్నికలకు ఆటంకం కలిగించవద్దు
శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేయించడం, నిర్బంధించడం, పోలింగ్ ఏజెంట్లను విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడుతోందని తిరుపతి ఎంపీ డా. మద్దిల గురుమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఉదయం ఆరు గంటల నుంచే పట్టణంలో ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని నిర్బంధాలు ప్రారంభించారని, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందన్నారు.
వైఎస్సార్‌సీపీ మైనారిటీ నాయకుడు పఠాన్ ఫరీద్ తల్లి కౌన్సిలర్‌గా పోటీ చేస్తుండగా, ఆయన పోలింగ్ ఏజెంట్‌గా వెళ్లాల్సి ఉన్నప్పటికీ ఉదయమే పోలీసులు అరెస్టు చేశారని ఎంపీ తెలిపారు. పట్టణానికి చెందిన పార్టీ ముఖ్య నాయకులు రామచంద్రారెడ్డి, సిరి నాగేశ్వరరావు, పగడాల రాజులను సైతం అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు. వీరి విడుదల కోసం ఉదయం నుంచే పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లినా, అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించడం దారుణమని అన్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకునే స్వేచ్ఛను కూడా అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
20వ, 26వ వార్డుల్లోని బాలాజీ పాఠశాల సమీపంలో బయటి ప్రాంతాల నుంచి సుమారు 200 మంది వ్యక్తులు గుమిగూడి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను పోలింగ్ కేంద్రాల వద్దకు రానీయకుండా అడ్డుకుంటున్నారని, రిగ్గింగ్‌కు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. 34వ వార్డులోని మొదటి పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్ నవీన్‌ను బలవంతంగా కొట్టి బయటకు పంపించారని ఆరోపించారు. ఈ ఘటనలపై ఫిర్యాదులు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.
శరవణతో పాటు ఆరుగురు ముఖ్య నాయకులకు బైండోవర్ నోటీసులు జారీ చేసి, పట్టణంలో ఉండకూడదని, దూర ప్రాంతాలకు వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారని ఎంపీ తెలిపారు. సూరా సురేష్, పఠాన్ ఫరీద్, షేక్ మహమ్మద్ బాషా తదితర నాయకులను సైతం పోలీసులు లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. చివరకు వైఎస్సార్‌సీపీ నాయకులకు జనరల్ పోలింగ్ ఏజెంట్ నియామక పత్రాలు అందించడంలో కూడా అధికారులు తీవ్ర ఇబ్బందులు సృష్టించారని, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకున్న తర్వాతే ఈరోజు ఉదయం అనుమతి లభించిందని వివరించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలను కోరుకుంటుందని, ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితులు కల్పించాలని ఎంపీ డిమాండ్ చేశారు. పోలీసు అధికారులు అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్ట ప్రకారం వ్యవహరించాలని, నిర్బంధంలో ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులను వెంటనే విడుదల చేయాలని, పోలింగ్ కేంద్రాల వద్ద అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదే విధమైన అక్రమాలు కొనసాగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేపడుతుందని స్పష్టం చేశారు. త్వరలో ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి పర్యటనలు, ఇప్పటికే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో శ్రీకాళహస్తిలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.
కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి