శ్రీ వివేకానంద విద్యాసంస్థలో శ్రీ లక్ష్మీ గణపతి అష్టద్రవ్య హోమం హోమంలో పాల్గొన్న మంత్రి వాసంశెట్టి సుభాష్
రామచంద్రపురం మేజర్ న్యూస్ :పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రామచంద్రపురంలోని శ్రీ వివేకానంద ఐసీఎస్ఈ ఇంటర్నేషనల్ స్కూల్‌లో శ్రీ లక్ష్మీ గణపతి అష్టద్రవ్య హోమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా ఆదివారం నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ ఏ. సరోజినీ వెంకటేశ్వరరావు దంపతుల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణలు, వేదఘోషల నడుమ ఈ పవిత్ర హోమ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం దంపతులు, మంత్రి వాసంశెట్టి సుభాష్ సతీమణి సునీత, రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ మేడిశెట్టి శేషారావు, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, ఎస్.కె.పి.పి. ట్రస్ట్ చైర్మన్ సలాది నాయుడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శైలుష తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ పవిత్రమైన కార్తీక మాసంలో విద్యార్థుల ఆయురారోగ్యాలు, విద్యాభివృద్ధి, ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ, రాష్ట్ర ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సుభిక్షం కలగాలని సంకల్పంతో అష్టద్రవ్య హోమం నిర్వహించడం ఎంతో శుభపరిణామమని పేర్కొన్నారు.
విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావంతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆధునిక విద్యతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను కూడా అలవర్చుకోవాలని సూచించారు. దైవభక్తి, గురుభక్తి, తల్లిదండ్రుల పట్ల గౌరవం ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని, విద్యాసంస్థలు మరింత అభివృద్ధి చెందాలని, సమాజంలో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని మంత్రి ప్రశంసించారు.
విద్యాసంస్థల కరస్పాండెంట్ ఏ. సరోజినీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు విద్యా, విజ్ఞాన రంగాల్లో రాణించడంతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా ఉండాలనే సత్సంకల్పంతో ఈ శ్రీ లక్ష్మీ గణపతి అష్టద్రవ్య హోమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. తమ విద్యాసంస్థలకు చెందిన ఆరు బ్రాంచీల ద్వారా సుమారు 2,500 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, వారి బంగారు భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్నామని వివరించారు. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవభావాన్ని పెంపొందించడమే తమ విద్యాసంస్థల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పట్టణ ప్రముఖులు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు