రెండో పులివెందుల గడ్డపై కూటమి జెండా.
అభ్యర్థుల ఎంపికపై స్థానిక కూటమి నాయకులతో ఎమ్మెల్యే నల్లమిల్లి సమావేశం.
అనపర్తి మేజర్ న్యూస్:రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అనపర్తి గడ్డపై కూటమి జెండా ఎగరడం ఖాయమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రెండో పులివెందులగా పిలుచుకునే అనపర్తి గడ్డపై పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం అనపర్తి గ్రామానికి చెందిన కూటమి నాయకులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అనపర్తి గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. గ్రామ సర్పంచ్ అభ్యర్థితో పాటు 20 వార్డుల సభ్యుల అభ్యర్థుల ఎంపిక విషయంలో స్థానిక కూటమి నాయకులందరూ సమన్వయంతో సమావేశమై చర్చించుకోవాలని అన్నారు. ప్రజల్లో మంచి పేరు, సేవాభావం, నాయకత్వ లక్షణాలు కలిగి, ప్రజలకు అందుబాటులో ఉండే సమర్థవంతమైన వ్యక్తులను అభ్యర్థులుగా ఎంపిక చేయాలని సూచించారు.
గత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కూటమికి సంపూర్ణ మద్దతు తెలిపారని, ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులకు మంచి విజయాన్ని అందించారని గుర్తుచేశారు. అదే ప్రజాదరణను రానున్న పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగిస్తూ అనపర్తి పంచాయతీలో కూటమి అభ్యర్థులందరూ విజయం సాధించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల్లో 100 శాతం విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతతో పనిచేయాలని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా అనపర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఎంపికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ పదవికి సాముదాన పాలెపు వీరన్నబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే అధికారికంగా అభ్యర్థి పేరు ప్రకటించాల్సి ఉంది. సర్పంచ్‌తో పాటు 20 వార్డుల అభ్యర్థుల ఎంపికపై కూటమి నాయకుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.మొత్తంగా అనపర్తి పంచాయతీ ఎన్నికలు కూటమి పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారగా, అభ్యర్థుల ఎంపిక, తుది ప్రకటనపై గ్రామ ప్రజలు, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. నేడు అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో అనపర్తి రాజకీయాలు మరింత వేడెక్కాయి.