పుస్తక పఠనంతోనే విజ్ఞాన వికాసం.. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి
కడియం శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు.. పుస్తక ప్రదర్శన ప్రారంభం
కడియం, మేజర్ న్యూస్ :59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం కడియం శాఖా గ్రంథాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గ్రంథాలయాధికారి ఎం. వీరలింగం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తూర్పు గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ రిటైర్డ్ కార్యదర్శి మారిశెట్టి సత్యనారాయణ, ప్రముఖ రైస్ మిల్లు యజమాని ఉప్పులూరి హనుమంతరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరు రిబ్బన్ కట్ చేసి పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉప్పులూరి హనుమంతరావు మాట్లాడుతూ గ్రంథాలయంలో విద్యార్థులు, పాఠకులకు అందుబాటులో అనేక రకాల పుస్తకాలు ఉన్నాయని, బయట సైతం సులభంగా లభించని విలువైన పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాన్ని సందర్శించి పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలని, తద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో 108వ సిబ్బంది, పాఠకులు నక్కా నాగేశ్వరరావు, నిత్య పాఠకుడు ఆర్.వి.బి. రామ్ చౌదరి, స్థానిక పెద్దలు, పలువురు పాఠకులు పాల్గొన్నారు.