శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు -- రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల పరిశీలకులు శేషగిరి బాబు
ఏలూరు,మేజర్ న్యూస్ : స్థానిక ఎన్నికల ప్రక్రియలో శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సాధారణ పరిశీలకులు , రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీస్, బాయిలర్లు, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసుల కార్యదర్శి మిరియాల వెంకట శేషగిరిబాబు అధికారులను ఆదేశించారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ తో కలిసి ఏలూరు జిల్లా కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో ఆదివారం వివిధ శాఖల జిల్లా అధికారులతో శేషగిరిబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులు శేషగిరిబాబు మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఆయా ప్రాంతాలలో అదనపు బలగాలతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలలో వీడియో చిత్రీకరణతోపాటు, సిసి కెమెరాలు ఏర్పాటుచేయాలన్నారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. జిలాల్లోని నగరపాలక సంస్థ, పురపాలక సంఘాలలో 130 వార్డులలో ఈనెల 28వ తేదీన పోలింగ్, 30వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు సంబంధించి ఎన్నికల సిబ్బందికి మొదటివిడత శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని, ఈనెల 23 నుండి 25వ తేదీలోగా రెండవ విడత శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజల నుండి ఫిర్యాదులు నమోదు పరిష్కారం నిమిత్తం జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ జిల్లాలో స్థానిక ఎన్నికలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, ఏలూరు నగరపాలక సంస్థ, నూజివీడు, జంగారెడ్డిగూడెం పురపాలక సంఘాలలో 376 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసారని, వీటిలో 297 సాధారణం కాగా, 46 సమస్యాత్మకం, 33 అతి సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ లతో అదనపు భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, ఇంచార్జ్ డిఆర్ఓ ఎం. ముక్కంటి, జిల్లా పరిషత్ సీఈఓ ఎం. కృష్ణమోహన్, జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, ఎస్డీసీ దేవకీదేవి, రవాణా శాఖా ఉప కమీషనర్ కరీం , ఆర్టీఓ శేఖర్, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ .భానుప్రతాప్, డిఎస్పీ శ్రావణ్ కుమార్, పంచాయతీరాజ్ ఎస్ఈ జెడ్.రమేష్, స్వర్ణగ్రామ,వార్డ్ నోడల్ అధికారి జి.వెంకటనాయుడు, ఎల్డిఎమ్ సత్యనారాయణ, మెప్మా పిడి రాజబాబు, సాంఘిక సంక్షేమ శాఖ జెడి విశ్వమోహన్ రెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం షబ్నమ్, గృహ నిర్మాణ శాఖ అధికారి సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సూర్య న్యూస్ జిల్లా ఇంచార్జ్ పసుమర్తి రాము ఏలూరు