సమన్వయంతోనే ప్రాంతీయ ప్రగతి --కలెక్టర్ హిమాన్షు శుక్ల
నెల్లూరు కలెక్టరేట్ (మేజర్ న్యూస్) : తిరుపతి ఎకనామిక్ రీజియన్ పరిధిలోని జిల్లాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తేనే సమగ్ర పారిశ్రామిక, ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. తిరుపతి కలెక్టరేట్‌లో బుధవారం తిరుపతి ఎకనామిక్ రీజియన్ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా ఆధ్వర్యంలో జరిగిన భాగస్వాముల సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలోని పారిశ్రామిక అవకాశాలు, మౌలిక వసతుల అవసరాలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలను వివరించారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు తదితర జిల్లాలను ఒకే ఆర్థిక రీజియన్‌గా పరిగణించి సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ సూచించారు. నెల్లూరు పోర్టును రీజియన్‌లోని ఇతర జిల్లాల ఎగుమతులు, దిగుమతులకు ఉపయోగించుకునేలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలకు అవసరమైన విద్యుత్, నీరు, రహదారులు, ఇతర మౌలిక వసతుల కల్పనపై రీజియన్ స్థాయిలో సమన్వయం అవసరమని పేర్కొన్నారు. 400 కేవీ సబ్‌స్టేషన్ల ఏర్పాటు, శ్రీశైలం, సోమశిల, కండలేరు ప్రాజెక్టుల నీటి వినియోగంపై కూడా జిల్లాల మధ్య సమన్వయం అవసరమన్నారు. 2047 నాటికి తిరుపతి ఎకనామిక్ రీజియన్‌ను రూ.80 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో పరిశ్రమలు, వ్యవసాయం, పర్యాటకం, లాజిస్టిక్స్, సేవల రంగాల్లో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సీఈఓ ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన 15 శాతం వృద్ధి రేటు సాధనకు జిల్లాల అధికారులు పరస్పర సహకారంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. సమన్వయంతో ప్రాంతీయ వనరులను వినియోగించుకోవడం ద్వారా పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు పేర్కొన్నారు.