సారస్వత నికేతనం సందర్శించిన ఆర్థిక రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ - అరుదైన గ్రంథాలు, తాళపత్రాలు, చారిత్రక సంపద పరిశీలన
వేటపాలెం, మేజర్‌న్యూస్ :
వర్తమాన భారత ఆర్థిక, రాజకీయ విశ్లేషణ రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ సోమవారం ఉదయం బాపట్ల జిల్లా వేటపాలెంలోని చారిత్రక సారస్వత నికేతనాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా సీనియర్ లైబ్రేరియన్ పి. శ్రీవల్లి, సహాయకుడు బండారు గోపికృష్ణ, గ్రంథాలయ సిబ్బంది ఆయనకు సాదర స్వాగతం పలికారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సారస్వత నికేతనం స్థాపన, అభివృద్ధి, నిర్వహణ విశేషాలను వివరించారు.స్వాతంత్ర్యోద్యమ కాలంలో సారస్వత నికేతనాన్ని సందర్శించిన జాతిపిత మహాత్మా గాంధీ వదిలి వెళ్లిన చేతికర్రను పరకాల ప్రభాకర్ ఆసక్తిగా పరిశీలించారు. భారతదేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ ఏర్పాటు చేసిన స్మారక ధ్వజస్తంభం ప్రాధాన్యతను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం స్వాతంత్ర్యోద్యమ కాలం నాటి దినపత్రికలు, అరుదైన తాళపత్ర గ్రంథాలు, ప్రాచీన సాహిత్య సంపద, ప్రసిద్ధ రచయితల రచనలను పరిశీలించారు. సారస్వత నికేతనాన్ని సందర్శించిన ప్రముఖులు, సాహితీవేత్తలు, రాజకీయ నాయకులు సందర్శకుల రిజిస్టర్‌లో నమోదు చేసిన అభిప్రాయాలను కూడా ఆసక్తిగా చదివారు.
గ్రంథాలయంలో భద్రపరిచిన అపురూపమైన చారిత్రక, సాహిత్య సంపదను చూసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు.చరిత్రను భద్రపరచడమే కాకుండా, తరతరాలకు విజ్ఞాన సంపదను అందిస్తున్న సారస్వత నికేతనం వంటి గ్రంథాలయాలు మన సాంస్కృతిక వారసత్వానికి విలువైన చిరునామాలనీ పరకాల ప్రభాకర్ అన్నారు.
ఈ సందర్భంగా సందర్శకుల రిజిస్టర్‌లో పరకాల ప్రభాకర్ తన అభిప్రాయాన్ని నమోదు చేస్తూ, సారస్వత నికేతనాన్ని సందర్శించాలన్న తన చిరకాల కోరిక ఇప్పటికి నెరవేరిందని, ఇక్కడికి రావడం ఒక తీర్థయాత్రకు వచ్చిన అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు.తెలుగు నేలపై మరెక్కడా లభించని అనేక పురాతన గ్రంథాలు, తాళపత్రాలు, పత్రికలను చూసే భాగ్యం కలిగిందని, ఇంతటి అపురూప సంపదను స్థాపించినవారు, నిర్వహణకు సహకరించినవారు, ప్రస్తుతం సేవలందిస్తున్న సిబ్బంది అభినందనీయులని కొనియాడారు. మరోసారి తప్పకుండా సందర్శించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ఈ పర్యటనలో రాష్ట్ర చేనేత జన సమాఖ్య వ్యవస్థాపకులు డాక్టర్ మాచర్ల మోహన్ రావు, సీనియర్ జర్నలిస్టు ఎన్. నాగార్జున రెడ్డి, చేనేత నాయకులు దేవన వీర నాగేశ్వరరావు, గుంటూరు మల్లికార్జునరావు, ఓరుగంటి రెడ్డి రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు మేడిబోయిన వెంకటరెడ్డి, బీసీ నాయకులు కొల్లిపర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.