కళ్యాణదుర్గం మండలం బట్వానిపల్లి గ్రామంలో మేతకు వెళ్లిన గొర్రెలు మేకలు మృతి.
బట్వానిపల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ తోటలో మేతకు వెళ్లిన గొర్రెలు మృత్యువాత పడటంతో బాధిత రైతు కుటుంబాల్లో తీవ్ర ఆవేదన నెలకొంది. గొల్ల ఆంజనేయులుకు చెందిన జెర్సీ ఆవుతో పాటు 15 గొర్రెలు మృతి చెందినట్లు సమాచారం. అదేవిధంగా బోయ గంగాధర్, ఓబులపతి, తిమ్మప్ప, గొల్ల తిప్పేస్వామికి చెందిన గొర్రెలు కూడా మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. సుమారు 2 వేల గొర్రెలు ఆ తోటలోని గడ్డిని మేసినట్లు సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సదరు తోటలో పది రోజుల క్రితం గడ్డిపై విషద్రావకం పిచికారీ చేసినట్లు స్థానికుల ద్వారా సమాచారం అందుతోంది. ఆ గడ్డిని మేయడం వల్లే గొర్రెలు, ఆవు మృతి చెందాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పశువైద్యాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, పోస్టుమార్టం లేదా అవసరమైన పరీక్షల ద్వారా మృతికి అసలు కారణాన్ని నిర్ధారించాల్సి ఉంది. తమ బిడ్డల్లా అల్లారుముద్దుగా పెంచుకున్న మూగజీవాలు మృతి చెందడంతో బాధిత గొర్రెల కాపరులు కన్నీరుమున్నీరవుతున్నారు. పశుపోషణపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలకు ఈ ఘటన తీరని ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఘటనా స్థలాన్ని పరిశీలించాలని, గడ్డి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాలని బాధితులు కోరుతున్నారు. మృతి చెందిన పశువులకు సంబంధించిన వివరాలను నమోదు చేసి, నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం తగిన పరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.