రొంపిచెర్ల జెడ్పీటీసీ పోరు రసవత్తరం…
రొంపిచెర్ల జెడ్పీటీసీ పోరు రసవత్తరం…
కోటా సుష్మకు వైఎస్ఆర్సీపీ బీఫారం..
టీడీపీలో అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ!
బీసీ మహిళకు రిజర్వ్ అయిన స్థానంపై ఆసక్తికరంగా మారిన రాజకీయ సమీకరణాలు
రొంపిచెర్ల, మేజర్ న్యూస్:
రొంపిచెర్ల మండల జెడ్పీటీసీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అభ్యర్థుల ఎంపికతో ప్రధాన పార్టీల్లో రాజకీయ వేడి పెరుగుతుండగా, వైఎస్సార్సీపీ తన అభ్యర్థిని ఖరారు చేసి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. మరోవైపు తెలుగుదేశం పార్టీలో అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీంతో రొంపిచెర్ల జెడ్పీటీసీ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
వైఎస్సార్సీపీ అభ్యర్థిగా కోటా సుష్మ.
రొంపిచెర్ల మండల వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా కోటా సుష్మను పార్టీ ఎంపిక చేసింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి సోమవారం ఆమెకు బీఫారం అందజేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి కోటా వెంకటరమణ కుమార్తె అయిన సుష్మ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. జెడ్పీటీసీ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో పార్టీ నాయకత్వం ఆమె అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
టీడీపీలో ఆరుగురి పోటీ.. ఎవరికి దక్కనుంది అవకాశం?
మరోవైపు తెలుగుదేశం పార్టీలో జెడ్పీటీసీ అభ్యర్థి ఎంపిక ఆసక్తికరంగా మారింది. ఈ స్థానం కోసం టీడీపీ నుంచి ఆరుగురు నామినేషన్లు దాఖలు చేయగా, వైఎస్సార్సీపీ నుంచి ఇద్దరు నామినేషన్లు వేశారు. టీడీపీలో అభ్యర్థిత్వం కోసం పలువురు నాయకులు ప్రయత్నాలు సాగిస్తుండటంతో పార్టీ అధిష్ఠానం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
టీడీపీ అభ్యర్థిగా ఉయ్యాల రాజేశ్వరి పేరు తెరపైకి వచ్చింది. ఆమెకు టికెట్ ఖరారైనట్లు ప్రచారం కూడా ప్రారంభమైంది. అయితే రాగల ఆనంద గౌడ్ తన భార్యకు అవకాశం కల్పించాలని, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పురం మల్లయ్య తన కోడలికి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. దీంతో పార్టీ అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేస్తారన్నది ఇంకా స్పష్టతకు రాలేదు.
అభ్యర్థుల ప్రకటనతో పెరగనున్న రాజకీయ వేడి.
జెడ్పీటీసీ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక కీలకంగా మారింది. వైఎస్సార్సీపీ ఇప్పటికే కోటా సుష్మకు బీఫారం అందజేయగా, టీడీపీ నుంచి అధికారికంగా ఎవరి పేరు ఖరారవుతుందనే అంశం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అభ్యర్థి ఎంపికలో నెలకొన్న పోటీ, వైఎస్సార్సీపీ అభ్యర్థి ఖరారు కావడంతో రొంపిచెర్ల జెడ్పీటీసీ ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.