రోగుల్లో సానుకూల దృక్పథం పెరిగేలా సేవలందించాలి డీఎంహెచ్వో
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : జిల్లాలోని 75 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు ,సిబ్బంది అందించే సేవలు రోగుల సంతృప్తి స్థాయి పెరిగేలా, ఆరోగ్య కేంద్రాలపై సానుకూల దృక్పథం పెంపొందేలా సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం స్థానిక వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 86 ఆరోగ్య సూచకలలో అనంతపురం జిల్లా ఎనిమిదవ స్థానంలో ఉందని, అయితే రోగుల నమ్మకం పెంచే దిశగా మరింత కృషి జరగాలన్నారు. సిజేరియన్లు తగ్గించేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగే విధంగా గర్భవతులను సన్నద్ధం చేయాలన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందిస్తున్న ఆరోగ్య సేవల ప్రచారం, అవగాహన కల్పించాలన్నారు. ఆరోగ్య కేంద్రంలో ఐదు దశలలో కూడా నూరు శాతం పోర్టల్ నమోదు జరగాలన్నారు. రాష్ట్రస్థాయిలో ముందుండే విధంగా సూచికల ప్రగతి సాధించాలని, ఏలాంటి నిర్లక్ష్యం, అలసత్వం సహించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పరిపాలనాధికారి డాక్టర్ మనోజ్ కుమార్, జాతీయ ఆరోగ్య మిషన్ అధికారి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎన్ సి డి అధికారి డాక్టర్ విష్ణుమూర్తి, గణాంక అధికారి మొహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.