రాయలసీమను 'జలసీమ'గా మారుస్తాం.. మూడేళ్లలో 36 ప్రాజెక్టులు పూర్తి: సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటటన
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 'గ్లోబల్ హార్టికల్చర్ హబ్' శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేశపూరితంగా ప్రసంగించారు. రాయలసీమను ఇకపై కరువు సీమ అని పలకడానికి వీల్లేదని, నిరంతర నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతాన్ని 'జల సీమ'గా మార్చి నిరూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. రూ.35 వేల కోట్ల వ్యయంతో నిలిచిపోయిన 36 ప్రాజెక్టులను వేగవంతం చేసి, రాబోయే మూడేళ్ల కాలంలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు.
చాలామంది నన్ను 'వాటర్ మ్యాన్' అని పిలుస్తుంటారని, ప్రతి ఎకరానికి నీరందించి రైతు కంట కన్నీరు తుడవడమే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఏపీకి అండగా నిలిచిందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు కర్మాగారాలకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులు మంజూరు చేసి ఆదుకుందని గుర్తుచేశారు. కేంద్ర సహకారంతో అత్యంత వేగంగా ముందుకు సాగుతున్న పోలవరం ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి, ప్రధాని మోదీ చేతుల మీదుగానే జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.