రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వేంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణానికి నిర్ణయం : మంత్రి ఆనం
పొదలకూరు , మేజర్ న్యూస్ : రాష్ట్రంలోని 175 శాసనసభ నియోజకవర్గాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలు లేని ప్రాంతాలను గుర్తించి, ఒక్కో నియోజకవర్గంలో ఒక ఆలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లోని స్థలం, పరిస్థితులను బట్టి ఒక్కో ఆలయ నిర్మాణానికి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు కేటాయించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించిన లక్ష్యం మేరకు 2028 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 5,000 నూతన దేవాలయాల నిర్మాణానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. సోమవారం ఉదయం పొదలకూరు మండలం మహమ్మదాపురం గ్రామంలో దాత పూండ్ల వెంకురెడ్డి సహకారంతో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి సోమవారం నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు దేవాదాయ శాఖ తరఫున ఇప్పటికే సుమారు రూ.14.50 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. కామన్ గుడ్ ఫండ్, ధూపదీప నైవేద్య పథకం, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాలకు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టు పరిధిలోని రెండు పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి భారత పురాతత్వ శాఖ (ఏఎస్‌ఐ) అధికారుల సహకారంతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో కలిసి ప్రణాళికలను పరిశీలించి, ఆమోదం అనంతరం నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆర్థిక వనరులు ఉన్న ఆలయాల్లో భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 151 ఆలయాల్లో అన్నప్రసాద వితరణ ప్రారంభించగా, 51 ఆలయాల్లో నిత్య అన్నప్రసాదం కొనసాగుతోందని పేర్కొన్నారు. గత ఏడాదిన్నర కాలంలో సుమారు మూడు కోట్ల మంది భక్తులు ఆలయాల్లో అన్నప్రసాదం స్వీకరించినట్లు వివరించారు.
అర్చకుల జీతభత్యాలు, వేద పండితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. వేద విద్యను అభ్యసించి సర్టిఫికెట్ పొందిన వారికి ఉపాధి లభించే వరకు నెలకు రూ.3,000 చొప్పున మూడేళ్ల పాటు సంభావన అందిస్తున్నట్లు, ఇప్పటికే 600 మందికి ఈ సహాయం అందుతోందని వివరించారు. వైదిక శాస్త్రాలు, వేద పండితులు, సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ, మహమ్మదాపురంలో దాత పూండ్ల వెంకటరెడ్డి సుమారు రూ.2 కోట్ల వ్యయంతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. ఆలయ ప్రాంగణంలో మరో భవన నిర్మాణానికి కామన్ గుడ్ ఫండ్ ద్వారా రూ.50 లక్షలు కేటాయించేందుకు మంత్రి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిపారు. గ్రామంలోని హైస్కూల్ అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధుల కింద రూ.50 లక్షలు సమకూర్చినట్లు, పాఠశాలకు అవసరమైన అదనపు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వేంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణానికి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు కేటాయించాలనే నిర్ణయాన్ని స్వాగతించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఆలయాలకు ఇప్పటికే రూ.14.50 కోట్లు మంజూరయ్యాయని, మరో రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు నిధుల ప్రతిపాదనలు ప్రక్రియలో ఉన్నాయని తెలిపారు. ఈ నిధులు కూడా మంజూరవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.