ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలి..జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
---ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలి... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
--ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు
ఖమ్మం, (సూర్య బ్యూరో):
ప్రజావాణిలో ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదు దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, ట్రైనీ కలెక్టర్ పారస్ కుమార్ లతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.ముదిగొండ మండలం మల్లన్నపాలెం గ్రామానికి చెందిన ఎస్.కే. జాన్ బీ తన సదరం సర్టిఫికెట్‌లో తప్పుడు వివరాల కారణంగా దివ్యాంగుల పింఛన్ నిలిచిపోయిందని, తిరిగి పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. ఈ విషయాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓను కలెక్టర్ ఆదేశించారు.పీడీఎస్‌యూ అధ్యక్షుడు టి. లక్ష్మణ్ పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ పేరుతో ముందస్తు ఇంటర్మీడియట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్న వేదాంత లెర్నింగ్ సెంటర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్జీ సమర్పించారు. దీనిపై పరిశీలించి నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.ఏదులాపురం పట్టణానికి చెందిన ఎస్.కే. ఆఫ్సానా తాను ఎంబీఏ పూర్తి చేశానని, తనకు ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించగా, విద్యార్హతలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలపై పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఉపాధి అధికారికి సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రామ్మూర్తి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.